ఏపీ నుంచి పారిపోయేలా జగన్ పాలన!
posted on Jun 20, 2023 @ 11:08AM
విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు, వైయస్ఆర్ సీపీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. సరే ఆ కిడ్నాప్ సుఖాంతమైందనుకోండి. అదలా ఉంచితే ఈ కిడ్నాప్ ఉదంతం రాష్ట్రంలో అందునా జగన్ కలల రాజధాని అయిన విశాఖ పట్నంలో శాంతి భద్రతలు ఎంత సుందరముదనష్టంగా వెలిగిపోతున్నాయో తేటతెల్లం చేసింది. అంతే కాదు ఏపీ వ్యాప్తంగా గత రెండు వారాలుగా జరిగిన వరుస హింసాత్మక సంఘటనలు ( దళితుడి హత్య, బాలుడి దహనం, దళిత మహిళపై అత్యాచారం వంటివి) రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పట్టాయి.
ఈ నేపథ్యంలోనే సాక్షాత్తే అధికార వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాష్ట్రంలో వ్యాపారాలు చేయలేనని ప్రకటించి తన వ్యాపారాలన్నిటినీ హైదరాబాద్ కు మార్చేస్తున్నానని ప్రకటించారు. ఆయన తన వ్యాపారాలను విశాఖపట్నం నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటన అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏపీలో వ్యాపారం చేయలేని పరిస్థితులున్నాయని సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీయే రాష్ట్రం నుంచి బిచాణా ఎత్తేయడానికి సిద్ధపడటంతో జనం, నెటిజనం సైతం అడెడ్డె అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
రాష్ట్రంలో సొంత పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకే కాదు.. వారి కుటుంబాలకు సైతం రక్షణ లేకుండా పోయిందని అందుకే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన వ్యాపారాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారని జనం అంటున్నారు. మరోవైపు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం మామూలు వ్యవహారం కాదని.. ఈ కిడ్నాప్ స్కెచ్‌లో పెద్ద తలకాయలే ఉన్నాయనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఈ వాస్తవం ఉందనడానికి ఎంపీ తన వ్యాపారాలను పక్క రాష్ట్రానికి తరలించేయాలని నిర్ణయం తీసుకోవడమే తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక సీఎం జగన్ ఉన్నారంటూ చేసిన ఆరోపణను గుర్తు చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత పార్టీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు.
అయినా ప్రతిపక్షాలు అంటే అడిపోసుకోంటాయంటారు కానీ, జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మొన్న చిత్తూరు జిల్లా నుంచి అమర్‌రాజా బ్యాటరీస్ తెలంగాణ రాజదాని హైదరాబాద్ వెళ్లిపోయింది. నిన్న విశాఖ జిల్లా నుంచి లూలూ గ్రూప్ సంస్థ.. తమిళనాడులోని కోయంబత్తురుకు తరలి పోయింది. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోవడానికి, వ్యాపారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి జగన్ ప్రభుత్వ తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రం నుంచి తరలిపోతున్న సంస్థల జాబితాలో ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన వ్యాపార సంస్థలు చేరిపోయాయని పేర్కొంటున్నారు.
అయితే తెలంగాణలోని హైదరాబాద్‌కు వెళ్లిపోయిన అమరరాజా బ్యాటరీస్ అంటే తెలుగుదేశం నాయకుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించింది. విశాఖపట్నం వేదికగా వ్యాపారం చేసుకోనేందుకు లూలూ గ్రూప్... గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకొంది. అయితే జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయడంతో.. లూలూ గ్రూప్ తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని.. తన వ్యాపారాన్ని ఆ రాష్ట్రంలో విస్తరించుకొనే పనిలో నిమగ్నమై పోయింది.
మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ లోక్‌సభ సభ్యుడు ఈ విధంగా తన వ్యాపారాలను హైదరాబాద్‌కు తరలించేస్తున్నాన్నంటూ స్వయంగా ప్రకటించడం చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ జగన్ ప్రభుత్వం ఎటువంటి సందేశం ఇస్తున్నట్లు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకొంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనే భావన ప్రజల్లో సైతం వ్యక్తమవుతోందని స్పష్టం చేస్తున్నారు.
విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన భార్య జ్యోతి, వారి కుమారుడు శరత్, ఎంపీ స్నేహితుడు కమ్ ఆడిటర్ జి.వెంకటేశ్వరరావులు ఇటీవల కిడ్నాప్ కు గురయ్యారు. ఆ క్రమంలో వారిపై కిడ్నాపర్లు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. అయితే ఈ కిడ్నాప్‌పై పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేసే సమయానికి ఈ దాడి జరిగిపోవడం గమనార్హం. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. కానీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.
ఇలా పలు వ్యాపార సంస్థలు.. రాష్ట్రం విడిచి వెళ్లిపోతే.. ఉపాధి లేక..యవత పెడ మార్గం పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును చేజేతులా కాలరాసుకొంటుందని చెబుతున్నారు. ఇటువంటి పరిణామాలకు... ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరు? ఓటు వేసి గెలిపించిన ఓటర్లా? ఓట్ల దండుకొనే క్రమంలో నోట్లు విసిరిన జిత్తుల మారి నాయకులా? అనేది మనస్సు పెట్టి ప్రతీ ఒక్కరు ఆలోచించాలని సూచిస్తున్నారు. లేకుంటే యవత భవితకే కాదు.. నవ్యంధ్రాకు సైతం కారు చీకట్లు కమ్ముకోవడం ఖాయమని ప్రజాస్వామిక వాదులు తీవ్ర ఆవేదనతో స్పష్టం చేస్తున్నారు.