కాంగ్రెస్ కిటకిట..బీఆర్ఎస్ వెలవెల
posted on Jun 20, 2023 @ 10:45AM
ఇన్నాళ్లూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వలసలతో వెలవెలబోతే.. చేరికలతో బీఆర్ఎస్ కిటకిటలాడింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఎన్నెళ్లు తిరిగొచ్చే మా ఇళ్లకు అన్న పాట చందంగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. గత ఎనిమిదేళ్లుగా ఎగ్జిట్ తప్ప ఎంట్రీ అన్నదే తెలియని ఆ పార్టీకి ఇప్పుడు కుప్పతెప్పలుగా చేరికలు ఉంటున్నాయి.
గత ఎనిమిదేళ్లుకు పైగా పార్టీ నుంచి వెళ్లిపోయేవారే తప్ప పార్టీలోకి వస్తామంటూ తలుపుతట్టిన వారే లేదు. దానికి తోడు వరుస ఎన్నికలలో డిపాజిట్లు సైతం కోల్పోయి డీలా పడిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కోత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ తమదే నంటూ చెప్పుకోవడానికి కూడా ముఖం చెల్లనంతగా డీలా పడిన కాంగ్రెస్ కు ఇప్పుడు రాష్ట్రంలో డిమాండ్ పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలి సారిగా ఆ పార్టీలో గెలుపు ధీమా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ బాబ్బాబు రండి అంటూ ప్రత్యర్థి పార్టీలలోని అసమ్మతి నేతలను కాంగ్రెస్ బతిమలాడుకునే పరిస్థితి ఉండేది.
అయితే ఇప్పుడు అది రివర్స్ అయ్యింది. పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు చేరికలకు షరతులు పెట్టే స్థితిలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏ షరతులు పెట్టినా సర్దుకు పోయేందుకు ఇతర పార్టీల నుంచి వస్తున్న వారు అంగీకరంచేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి కూడా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలకు కారణమౌతోంది. పట్నం మహేందర్ రెడ్డి విషయమే తీసుకుంటే.. ఆయన గత ఎన్నికలలో రేవంత్ రెడ్డిని ఓడించడానికి కొడంగల్ పై పూర్తి కాన్సన్ ట్రేట్ చేశారు. రేవంత్ రెడ్డిపై తన తమ్ముడిని గెలిపించుకున్నారు.
కానీ తన సొంత నియోజకవర్గంలో మాత్రం పరాజయం పాలయ్యారు. అక్కడ నుంచి విజయం సాధించిన పైలట్ రోహిత్ రెడ్డి ఆ తరువాతి పరిణామాలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) గూటికి చేరారు. ఇప్పుడు కేసీఆర్ పైలట్ రోహిత్ రెడ్డికే వచ్చే ఎన్నికలలో టికెట్ కన్ ఫర్మ్ చేశారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఆయనలాగే బీఆర్ఎస్ లో చాలా మంది బలమైన నేతలకు టికెట్ దక్కే అవకాశాలు లేవు. సిట్టింగులకే టికెట్లు అంటూ ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత పని చేసే వారికే అంటూ చిన్న సవరణ చేసినా.. ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చి చేరిన సిట్టింగులు ధీమాగా ఉంటే.. పార్టీ కోసం కష్టపడి మాజీలుగా ఉన్న వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో కి వచ్చే వారిలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలే అధికంగా ఉంటారని అంటున్నారు. కాగా ఈ చేరికలు వచ్చే నెలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఆయన సమక్షంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మల్లు రవి నేతృత్వంలో రేవంత్ నియమించిన కమిటీ ఇప్పటికే కాంగ్రెస్ లో వచ్చి చేరే వారి జాబితాను సిద్ధం చేసే పనిలో ఉంది.