లిటిల్ మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఇంట సందడి!
posted on Jun 20, 2023 @ 1:50PM
మెగా ఇంట పండుగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలుపుతూ ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.
మెగా వారసురాలు రాకతో మెగా కుటుంబంలో, మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెగా జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. "లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం" అంటూ మనవరాలు పుట్టిన సందర్భంగా తన సంతోషాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. నీ రాకతో మెగా కుటుంబంలో సంతోషం నెలకొందంటూ ట్వీట్ చేశారు.
ఇక రామ్ చరణ్ తో 'ఆర్ఆర్ఆర్' స్క్రీన్ ని పంచుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.