వైసీపీ నుంచి వలసల వరద.. గేట్లెత్తేసినట్లేనా?
posted on Aug 11, 2023 @ 2:10PM
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆశావహులు పార్టీలు మారడం అత్యంత సహజమైన అంశం. అయితే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే నేతల పార్టీల మార్పు భారీగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే వచ్చిన కొన్ని సర్వేల ఫలితాలు, ప్రతిపక్ష నేతల రోడ్ షోలకు సభలకు తండోపతండాలు వస్తున్న జనాలను చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో క్లియర్ కట్ గా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఈసారి వైసీపీ నుండి భారీగా వలసలు ఉండడం గ్యారంటీగా కనిపిస్తున్నదని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో పడకేసిన అభివృద్ధితో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉండగా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సరైన సమయం కోసం చూస్తున్నారని . ఒక్కసారి ఎన్నికల మూడ్ మొదలైతే వీరంతా పొలోమని వలసలు మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
వైసీపీ నుండి బహిష్కరణకు గురైన నలుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరడం ఖరారైనట్లే. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి ఇప్పటికే సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలవగా నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర బాధ్యతలను కూడా చూసుకున్నారు. ఇ దే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొనగా.. మేకపాటి ఈసారి టీడీపీ నుండి ఉదయగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా లోకేష్ ప్రకటించారు. మరోవైపు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీ నేతలతో టచ్ లోనే ఉన్నారు. కాగా, ఇప్పుడు తాజాగా మరో బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏకంగా గుంటూరు నుండి ఉత్తరాంధ్రకి వెళ్లి మరీ చంద్రబాబును కలిసిన శ్రీదేవి లోకేష్ పాదయాత్ర తన నియోజకవర్గంలోకి వచ్చే సమయానికి తన కార్యాచరణ ప్రకటిస్తానని కూడా చెప్పారు.
కాగా వైసీపీ ఈ నలుగురు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు సందర్భంగా ఇంకా ఇటువంటి వారు 56 మంది వరకూ ఉన్నారని పార్టీ వర్గాలలోనే గట్టిగా చర్చ జరిగింది. కచ్చితంగా సంఖ్య ఇదీ అని చెప్పకుండా ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో అసంతృప్తుల గురించి ప్రస్తావించారు. సరే వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురి దారి తెలుగుదేశం పార్టీ వైపే అని తేలిపోయింది. ఇక ఇప్పుడు పార్టీలో అసంతృప్తులుగా ఉన్నారని చెబుతున్న మిగిలిన 56 మంది పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్నారు. వారంతా కూడా పార్టీని వీడటం ఖాయమేనా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈసారి వైసీపీకి భారీ ఝలక్ తప్పేలా లేదు. ఇప్పటికే టీడీపీలో ఉన్న మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నారాయణలతో పాటు ఇప్పుడు సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తోడైతే జిల్లాలో వై ఎట్ లీస్ట్ వన్ సీట్ అన్న పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికలలో ఈ జిల్లాలో పది పది స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. కావలి నుండి బీద రవిచంద్ర తన సతీమణిని రంగంలోకి దింపనుండడం.. సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ పై అసంతృప్తితో ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆయనను దూరం పెట్టడం అన్నీ వెరసి ఇక్కడ ఈసారి టీడీపీ ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీకి దగ్గరైన ముగ్గురితో పాటు మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీతో టచ్ లో ఉన్నట్లు ఇప్పటికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.
ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన సిద్దా రాఘవరావు, ఆయన తనయుడు సుధీర్, మరో నేత కదిరి బాబురావు ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వచ్ాచరు. వారు ఇక కండువా కప్పుకోవడమే తరువాయి అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కలిపిన కందుకూరు నుండి ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉండగా అసలు జిల్లాకే పెద్దన్నయ్య పాత్ర పోషించిన బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీయే పొమ్మనలేకపోగ బెట్టడంతో ఆయనా ఆంటీ ముట్టనట్లే ఉంటున్నారు. గిద్దలూరు ఆనం రాంబాబుకు అధిష్టానమే టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా ఇచ్చినా ఆయన గెలిచే పరిస్థితి లేదని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. చీరాల నుండి ఆమంచి తన సోదరుడిని ఇప్పటికే జనసేనకు పంపగా.. తాను కూడా సరైన సమయం కోసం చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీనియర్ నేత కరణం బలరాం మళ్ళీ టీడీపీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నట్లు జిల్లా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ఇక, ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలలో అయితే వైసీపీ నుండి భారీగా వికెట్లు పడడం గ్యారంటీగా కనిపిస్తున్నది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లాంటి వారే ఈ మధ్య పత్తా లేకుండా పోగా.. ఉండవల్లి శ్రీదేవి, వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే టీడీపీకి టచ్ లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారితో సహా మరో ఏడెనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఉత్తరాంధ్ర నుండి కూడా ఈసారి భారీగా వలసలు ఉండే అవకాశం ఉంది. శ్రీవాణి, అప్పల నాయుడు, అప్పల నరసయ్య, వీరభద్రస్వామి, గొల్ల బాబురావు, ఉమా శంకర్ గణేష్ ఇలా చాలా పేర్లు వలసల జాబితాలో వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి అవంతి పార్టీ జంప్ చేసినా ఆశ్చర్యం లేదన్నది ఉత్తరాంధ్ర రాజకీయాలలో ఆసక్తికరంగా వినిపిస్తున్న మాట.