జయ ప్రదకు జైలు
posted on Aug 11, 2023 @ 3:15PM
అలనాటి హీరోయిన్ జయప్రదకు జైలు శిక్ష పడటం సినీ, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కేసులో ఆమెకు ఎగ్మోర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు చెందిన థియేటర్ కార్మికుల కేసులో ఈ తీర్పు వెలువరించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది.
జయ ప్రద అసలు పేరు లలితారాణి రావ్.
సీనియర్ హీరోయిన్ జయ ప్రద గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె 1974లోనే భూమి కోసం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. తెలుగు, తమిళ,హిందీ, కన్నడ, మళయాళ, బెంగాల్ చిత్రాల్లో ఆమె నటించింది. 70వ, 80వ దశకంలో ఓ వెలుగు వెలిగారు. అగ్ర నటులతో హీరోయిన్ గా చేశారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు.
కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు జయ ప్రద రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీలో చేరారు. అనేక బాలివుడ్ చిత్రాల్లో నటించిన జయ ప్రదను ఉత్త రాదిన కూడా అభిమానులను ఏర్పరచుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఆమె సమాజ్ వాది పార్టీ తరపున గెలిచారు. రెండు పర్యాయాలు అదే నియోజక వర్గం నుంచి గెలుపొందారు.
చెన్నైలోని రాయపేటలో మాజీ ఎంపీ జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఈ థియేటర్ ను నడిపించారు. ప్రారంభంలో బాగానే నడిచినా తర్వాతి కాలంలో థియేటర్ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో థియేటర్ ను బంద్ చేశారు.
థియేటర్ లో పనిచేసిన కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. దీనిపై ఇటు కార్మికులు, అటు కార్పొరేషన్ ఎగ్మూరు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బయట సెటిల్ చేసుకుంటామని, ఆ మొత్తం వెంటనే చెల్లించేందుకు సిద్ధమని జయప్రద తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు.
ఇదే విషయాన్ని వివరిస్తూ కోర్టులో మూడు పిటిషన్లను కూడా దాఖలు చేశారు. అయితే, కోర్టు ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాయర్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని కేసును కొనసాగించింది. ప్రస్తుతం జయప్రద... ప్రముఖ టీవీలో ప్రసారం అయ్యే కామెడీ షోలో జడ్జ్ గా పాల్గొంటున్నారు. ఆమె చాలా కాలం తర్వాత బుల్లితెరపై కనిపించడంతో.. అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఈ తీర్పుతో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.