వరల్డ్ కప్ జట్టులో హైదరాబాద్ కుర్రోడు?
posted on Aug 11, 2023 @ 1:02PM
అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ తరువాత హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రికెటర్లు పెద్దగా కనిపించరు. ఒక వేళ అడపాదడపా ఒకరిద్దరికి చాన్స్ వచ్చినా అది ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది తప్ప వారికి పెద్దగా గుర్తింపు కూడా రాలేదు. ఇక అంబటి రాయుడు ఉన్నా అతని కెరీర్ మొత్తం వివాదాలతోనే సరిపోయింది. అర్హత ఉండి కూడా వివాదాల కారణంగానే వరల్డ్ కప్ కు అవకాశం లేకుండా పోయిందని అంటారు. అందుకు అలిగి ఆయన క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.
అయితే ఇప్పడు అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా సత్తాచాటే సామర్థ్యం హైదరాబాద్ కుర్రోడు తిలక్ లో ఉందని, ధోనీ లాంటి ఫినిషర్, సెహ్వాగ్ లాంటి అగ్రెసివ్ నెస్, కోహ్లీ లాంటి క్లాస్ తిలక్ లో ఉన్నాయనీ క్రీడా పండితులు చెబుతున్నారు. టి20లలో అరంగేట్రంలోనే విండీస్ పై తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు తిలక్. అలాంటి తిలక్ కు ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్ కు ఎంపిక అయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా భారత క్రికెట్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో తొలి సారిగా ఇండియన్ క్యాప్ ధరించిన తిలక్ వర్మ మూడు వన్డేలలోనూ వరుసగా 39, 51, 49 నాటౌట్ స్కోర్లతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
మూడు మ్యాచ్‌ల్లోనూ జట్టు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి జట్టును ఆదుకున్నాడు. 20 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్ లో అతడు చూపుతున్న ప్రతిభ, పరిణితి టాక్ ఆప్ ది క్రికెట్ గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే మరో రెండు నెలలలో వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆ వరల్డ్ కప్ కు ఇండియా తరఫున ఆడే ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలక్టర్లు ఒక అంచనాకు వచ్చేసి ఉన్నాయి. అయితే జట్టు ఎంపిక విషయంలో తిలక్ వర్మ పేరును పరిశీలించకుండా ఉండే పరిస్థితి లేదని మాజీలు గట్టిగా చెబుతున్నారు.
వెస్టిండీస్‌తో టీ20ల్లో తిలక్ వర్మ ఆట చూసిన తరువాత ఇండియన్ క్రికెట్ కు మరో స్టార్ లభించాడని అర్ధమైపోయిందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ప్రపంచకప్‌కు కోసం టీమ్ఇండియా తరఫున ఆడే ఆటగాళ్లలో తిలక్ వర్మ కచ్చితంగా ఒకడిగా ఉంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. టి 20లలో రాణించినంత మాత్రాన వన్డేల్లో అదరగొడతాడన్న నమ్మకం ఏముందని ప్రశ్నించే వారు సూర్యకుమార్ యాదవ్ ను ఉదాహరణగా చూపుతున్నారు. టి20ల్లో అదరగొట్టే సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో తేలిపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే తిలక్ వర్మ విషయం వేరనీ, లిస్ట్-ఏ క్రికెట్‌లో తిలక్ వర్మకు అద్భుతమైన గణాంకాలు ఉన్నాయని, అతడిని వన్డేల్లో ఆడిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చునని భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్‌కే ప్రసాద్ గట్టిగా చెబుతున్నారు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో హైదరాబాద్ తరుపున 25 మ్యాచులు ఆడిన తిలక్ 56.18 సగటుతో 1,236 పరుగులు చేశాడు. వీటిలో ఐదు శతకాలు, ఐదు అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో ఫినిషర్ పాత్రకు తిలక్ వర్మ కచ్చితంగా అతికినట్టుగా సరిపోతాడని, సెలక్టర్ లు అతడిని పరిగణనలోనికి తీసుకోకతప్పదని అంటున్నారు.