ఎంపీ అభ్యర్థుల కోసం వైసీపీ వేట!?
posted on Jul 13, 2023 @ 10:02AM
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమయం వచ్చేసింది. తెలంగాణలో ఈ ఏడాదే ఎన్నికలు జరగనుండగా.. అక్కడ రాజకీయం కాకమీదుంది. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు అందుకు సమాయత్తమవుతున్నాయి. మరో వైపు కేంద్రం మినీ జమిలీకి వెళ్లే ఆలోచన ఉందనే ప్రచారం కూడా ఏపీ పొలిటికల్ హీట్ పెంచేసింది. దీంతో ఈ నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఏడాది ఇంకో లెక్క అన్నట్లుగా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముందుగా తమ పార్టీలో ఏం జరుగుతుంది? రానున్న ఎన్నికలలో గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? గెలుపు గుర్రాలు ఎవరు? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ మొదలు పెట్టారు.
ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు చేయించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఇటీవల పనితీరు బాలేని ఎమ్మెల్యేలకు క్లాసు కూడా పీకారు. ఒక రకంగా చెప్పాలంటే పర్ఫామెన్స్ రిపోర్టర్ వీక్ గా ఉన్న వారందరికీ తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ వర్క్ షాప్ మొదలు పెట్టారు. ఇకనైనా పని తీరు మార్చుకోకపోతే 20 నుండి 25 మందికి టికెట్లు ఇవ్వడం కష్టమేననని తేల్చేసినట్లు తెలిసింది. మరో 20 మంది ఎమ్మెల్యేలకు అయితే అసలు టికెట్లు ఇచ్చేది లేదని, మహా అయితే ఈ ఏడాదిలో ఇప్పటి నుండి పర్ఫామెన్స్ బావుంటే ఒకరిద్దరికి నియోజకవర్గ బదిలీ చేసే అవకాశం మాత్రమే ఉంటుందని కూడా చెప్పేశారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పుడు వైసీపీ ఎంపీల టికెట్ల వ్యవహారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోకస్ చేసినట్లు తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం
గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు 22 మంది విజయం దక్కించుకున్నారు. వీరిలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రెబల్‌గా మారి సొంత పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత జరిగినా ఆయన్ను పార్టీ ఇప్పటి వరకూ సస్పెండ్ చేయలేదు.. ఆయనా రాజీమానా చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే వైసీపీకి ఇప్పుడు 21 మంది ఎంపీల బలం ఉంది. ఇప్పటికే వీరిలో నలుగురు ఎంపీలు వచ్చే ఎన్నికల్లో తాము ఎంపీగా పోటీ చేయలేమని అధిష్టానానికి చెప్పేసినట్లుగా తెలుస్తుంది. వీరిలో అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతి, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కాకినాడ ఎంపీ వంగా గీత ఉన్నారు. ఈ నలుగురూ కూడా ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నది తమ భావనగా అధిష్టానానికి ఇప్పటికే చెప్పినట్లుగా ప్రచారం జరుగుతున్నది. దానికి వైసీపీ నుండి ఎలాంటి స్పందనా రాకపోవడంతో చాలాకాలంగా ఈ నలుగురు పార్టీకి కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నాలుగు స్థానాలలో వైసీపీ కొత్త వారిని వెతుక్కోవాల్సిందే.
ఆ నలుగురు వారికి వారే ఈసారి పార్లమెంటుకు వెళ్ళేది లేదని నిర్ణయించుకోగా మరో నలుగురు ఎంపీలను పార్టీ అధిష్టానమే ఈసారి అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఈ నలుగురినీ అసెంబ్లీలో తమకి అండగా ఉంటారనే కారణంగా అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు వైసీపీ కొత్త అభ్యర్థులకు దించాల్సి ఉండగా.. మరో ముగ్గురు ఎంపీలు వారి వారి స్థానాలలో గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవని రిపోర్టర్లు వచ్చినట్లు తెలుస్తుండగా వారిని కూడా మార్చాలని వైసీపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అంటే మొత్తంగా 21 మందిలో పది మంది పాత వారికి మాత్రమే ఎంపీ టికెట్లు ఇవ్వనుండగా 11 లోక్ సభ నియోజకవర్గాలలో కొత్త వారినే బరిలోకి దించాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ 21 కాకుండా మిగతా 4 స్థానాలలో ఎంపీ ఆర్ఆర్ఆర్ స్థానంతో పాటు మరో స్థానంలో కొత్త వారికి అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.