పవన్ పై రోజా విమర్శలు బూమరాంగ్
posted on Jul 13, 2023 @ 10:25AM
జగన్ ను మెప్పించేందుకు మంత్రి రోజా చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా వైసీపీ ఇరుక్కుంది. జగన్ సర్కార్ తరచూ చెప్పే రివర్స్ ఇప్పుడు రోజాకు ఎదురైంది. జనసేన పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నంలో రోజా ప్రదర్శించిన అత్యుత్సాహం బూమరాంగ్ అయ్యింది. వైపీపీనే డిఫెన్స్ లో పడేసింది.
ఏపీలో మహిళలు మాయం, కిడ్నాపుల వెనుక వాలంటీర్లు, వైసీపీ నేతలు ఉన్నారన్న పవన్ ఆరోపణలపై వైపీపీ మంత్రులు ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కొందరు మహిళా వాలంటీర్ల ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ పవన్ కు నోటీసులు కూడా పంపింది.
ఐదువేల రూపాయల కోసం రాష్ట్ర ప్రజల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని, జీవితాలు త్యాగం చేసిన వాలంటీర్లపై ఆరోపణలు చేసిన పవన్.. తక్షణం క్షమాపణ చెప్పి, వాలంటీర్ల కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలంటూ మంత్రి రోజా పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేశారు. అలాగే పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. దీంతో జనసేన శ్రేణులు రాష్ట్రంలో వాలంటీర్లు చేసిన అరాచకాలను ఆధారాలతో సహా బయటపెడుతూ మంత్రి రోజాకు ప్రశ్నలు సంధించారు.
జనసేనాని మొత్తం వాలంటీర్లనందరినీ విమర్శించలేదనీ, వారిలో కొందరు అరాచకాలను ఎత్తి చూపారనీ, అసలు అలాంటి వాటికి అవకాశం ఇస్తున్న వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నించారనీ జనసైనికులు అంటున్నారు. మంత్రి రోజా పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలకు స్పందిస్తూ.. వాలంటీర్లు పాల్పడిన అత్యాచారాలు, పొరుగురాష్ట్రం నుంచి మద్యం బాటిళ్లు తీసుకువస్తూ పట్టుబడిన ఉదంతాలు, వితంతులను వేధించిన ఘటనలను, పెన్షన్లను కొట్టేసిన సంఘటనలను ఆధారాలతో సహా వెల్లడిస్తూ అటువంటి వారికి మంత్రి రోజా మద్దతు ఇస్తున్నారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. అలాగే జగన నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో వాలంటీర్ల చేతిలో అత్యాచారానికి గురైన బాలికలు, వేధింపులకు గురైన ఒంటరి మహిళలు, కిడ్నాప్ అయిన బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదులతో కూడిన వీడియోక్లిప్పింగులను జత చేస్తూ సామాజిక మాధ్యమంలో రోజాపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.
దీంతో రాష్ట్రంలో వాలంటీర్ల అత్యాచారాలు, అకృత్యాలకు సంబంధించి ఆధారాలతో సహా జనసైనికులు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టడంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది. రోజా అత్యుత్సాహంతో వలంటీర్లను వెనకేసుకొస్తూ చేసిన విమర్శలు బూమరాంగ్ అవ్వడంతో వైసీపీ అడ్డంగా బుక్కైనట్లు అయ్యింది. వలంటీర్లు అకృత్యాలు, అరాచకాలు, అమానుషానికి పాల్పడినప్పుడు నోరు విప్పని మంత్రి రోజా ఆ అకృత్యాలు చేసిన వారిని సమర్ధిస్తూ మాట్లాడటాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.