గోరంట్ల మాధవ్ పై చర్యకు వైసీపీ ఎందుకు జంకుతోంది? కారణమదేనా?
posted on Aug 5, 2022 @ 2:50PM
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ వీడియోతో అడ్డంగా దొరికిపోయినా జగన్ ఆయన మీద చర్య తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. మాధవ్ ఆ వీడియోలో ఉన్నది తాను కాదనీ, మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తున్నారనీ, విచారణ అనంతరం వీడియో మార్ఫింగ్ కాలేదని తేలితే చర్య తీసుకుంటామని మంత్రులు అంటున్నారు.
అంతే తప్ప ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యకూ ఉపక్రమించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతటి అసహ్యకరమైన రీతిలో మాధవ్ దొరికిపోయినా.. సామాజిక మాధ్యమంలో మాధవ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నా, మాధవ్ పై చర్యకు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నా వైసీపీ సర్కార్ లో కదలిక లేకపోవడానికి కారణమేమిటి? మాధవ్ పై చర్యకు జగన్ జంకుతున్నారా? మాధవ్ పై చర్య తీసుకుంటే మరో ఇద్దరు, మంతి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ల మాటేమిటని జనం నిలదీస్తారన్న భయమా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇంతటి జగుప్సాకర రీతిలో మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయినా విచారణ, నిజం నిగ్గు తేలాలంటూ చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు ఏదైనా తీవ్ర మైన ఆరోపణ వచ్చినప్పుడు అదీ బాధ్యతాయుతమైన ఎంపీ వంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేసి విచారణలో నిర్దోషి అని తేలితే అప్పుడు తిరిగి తీసుకోవాలి. కానీ వైసీపీ మాత్రం గోరంట్ల మాధవ్ విషయంలో చర్యకు వెనుకాడుతోంది. ఇందుకు కారణం మాధవ్ నైజమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. గతంలో జేసీ దివాకర్ రెడ్డిని సవాల్ చేసిన గోరంట్ల.. ఇప్పుడు ఈ వీడియో విషయంలో తనపై చర్య తీసుకుంటే జగన్ ను సైతం సవాల్ చేయడానికి వెనుకాడడన్న జంకే అతడి పై చర్య విషయంలో వైసీపీ ముందు వెనుకలాడటానికి కారణమంటున్నారు. అంబటి, ఆవంతి శ్రీనివాస్ లపై చర్య ఎందుకు తీసుకోలేదనీ, బీసీని కావడం వల్లే తనపై చర్య తీసుకున్నారనీ యాగీ చేసే అవకాశాలు ఉన్నాయని అందుకే మాధవ్ విషయంలో జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
సజ్జల, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మినమా మాధవ్ విషయంలో ఇతర వైసీపీ నేతలెవరూ ఏ మాత్రం స్పందించకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. అయిన దానికీ కానిదానికీ ట్విట్టర్ వేదకగా తెలుగుదేశంపై విరుచుకుపడే విజయసాయి కూడా మాధవ్ స్వయంగా తెలుగు దేశం కు చెందన కొందరి పేర్లు ప్రస్తావించి మరీ మార్ఫింగ్ చేశారంటూ ఆరోపించినా మాధవ్ కు మద్దతుగా ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడాన్ని ఎత్తి చూపుతూ మాధవ్ న్యూడ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలిపోవడమే కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలోనే అంబటి రాంబాబు, ఆవంతి శ్రీనివాస్ లపై పార్టీ పరంగా చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు మాధవ్ విషయంలో కఠినంగా వ్యవహరించడానికి జంకాల్సిన పని ఉండేది కాదని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.
ఇక గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పార్లమెంటులో కూడా వైసీపీ పరువు తీసేసింది. ఇతర పార్టీల ఎంపీలు సైతం తమను చులకనగా వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ ఎంపీలే చెబుతున్నారు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అయితే ఈ వ్యవహారంపై సీఎం జగన్ తక్షణమే స్పందించాలన్నారు. ఎందుకంటే వైసీపీ ఎంపీలెవరూ తాడేపల్లి ప్యాలస్ పర్మిషన్ లేకుండా గాలి కూడా పీల్చుకోలేరని సెటైర్ వేశారు. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి, ఎంపీ గోరంట్ల చూపిస్తున్న జిమ్ వీడియోకి సంబంధమే లేదన్నారు. ఈ రెండు వీడియోలను మరో రాష్ట్రంలోని ఫోరెన్సిక్‌కి పంపిస్తేనే అసలు నిజం తెలుస్తుందన్నారు.