కుప్పంలో బాబు పై విజేతకు మంత్రిపదవి .. జగన్
posted on Aug 5, 2022 @ 2:23PM
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నియోజకవర్గాలవారీగా వైసీపీ క్యాడర్‌తో పార్టీ అధినేత జగన్ సమావేశాలు గురువారం ఆరంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంతో ఆయన ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. కుప్పంలో పార్టీ విజయానికి అందరూ శక్తికి మించి కృషి చేయాలని క్యాడర్‌కు లక్ష్యాన్ని నిర్దేశించారు. కుప్పంలో బాబుపై గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తానని జగన్ ప్రకటించారు.
కుప్పం తన స్వంత నియోజకవర్గంగా భావిస్తున్నానని, నియోజకవర్గం అభివృద్ధికి అన్నివిధాల కృషి చేస్తా మన్నారు. మరోరెండు రోజుల్లో కుప్పం మునిసిపాలిటీకి రూ.65 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నియోజక వర్గం లో అన్ని పనులు సత్వరం ఆరంభమయ్యేలా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హాయాంలో కుప్పం అభివృద్ధితో ప్రస్తుత పరిస్థితులను పోలుస్తూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కుప్పంలో ఊహించని అభివృద్ధి జరిగిందని, అది గమనించే ప్రజలు మునిసిపల్ ఎన్నికల్లోనూ వైసీపీకి పట్టం కట్టారనీ జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ ను గెలిపించండి, ఆయనకు మంత్రిపదవి ఇస్తా నని జగన్ క్యాడర్ కు చెప్పారు. కాగా, కప్పం ఆర్ ఇ ఎస్ ఓ చైర్మన్ సెందిల్ కుమార్కు కీలక బాధ్యత అప్పగించనున్నట్టు చెబుతూ, వచ్చే ఎన్ని కల్లో భరత్ చంద్రబాబును ఓడిస్తే సెందిల్‌కు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని అన్నారు.
ఇదిలా ఉండగా, హంద్రీనీవా బ్రాంచి కెనాల్ నిర్మాణ పనులను నిలువరించడంపై బిజెపి ఎంపీ సీఎం రమేష్ పై భరత్ మండిపడ్డారు. వాస్తవానికి కెనాల్ నిర్మాణపనులు రమేష్ చేపట్టి చంద్రబాబునాయుడికి మేలు జరగాలన్న ఆకాంక్షతోనే పనులను మధ్యలో రమేష్ వదిలేశారని భరత్ విమర్శించారు. కాగా, జగన్ ఆ కెనాల్ కాంట్రాక్ట్ ను రద్దు చేసి మళ్లీ టెండర్లకు వీలుకల్పించనున్నారనీ, పనులు పూర్తయితే కుప్పం నియోజకవర్గంలో వైసీసీ గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఎమ్మెల్సీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఈ సమావేశంలోనే మాజీ సర్పంచ్ వైసీపీ నేత మురళి పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుప్పంలో ప్రముఖ కుటుంబాలు పార్టీ కీలక పాత్ర వహిస్తున్నాయని, పార్టీకోసం రాత్రింబవళ్లూ కృషిచేస్తున్న సాధారణ కార్యకర్తలు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగయితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ 75 స్థానాలుకూడా గెలవలేదన్నారు. కాగా మురళి వాదనను అటుంచి, జగన్ కుప్పం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో పార్టీ గెలవడం మీదనే అందరూ దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.