వాస్తవ వేదిక.. వారికే కాంట్రాక్టులు.. అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా
posted on Jan 16, 2026 @ 1:59PM
ఆంధ్రప్రదేశ్ లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా కడప జిల్లాలోని మంగంపేట బారైటీస్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినవి. అయితే, ఈ సంపద రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల పరమవుతోందని 'జమీన్ రైతు' ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ తో కలిసి పంచుకున్న వాస్తవ వేదికలో ఆయన బైరైటీస్ దోపిడీపై పలు సంచలన విషయాలు వెల్లడించారు.
రాయలసీమ ఆర్థిక వ్యవస్థలో మంగంపేట బారైటీస్ కీలక పాత్ర పోషిస్తాయి. అందులో సందేహం లేదు. గతంలో ఇక్కడ జరిగిన విపరీతమైన అవినీతిని అరికట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ మైనింగ్‌ను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించారు. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయన్నారు డోలేంద్ర ప్రసాద్. మంగంపేట బారైటీస్ విషయంలో గత జగన్ సర్కార్ చేసిన తప్పులనే ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నదని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక టన్ను బారైటీస్ ధర సుమారు 140 డాలర్లు అంటే బారత కరెన్సీలో 12,704.79 రూపాయలు ఉంటే, ఇక్కడి కాంట్రాక్టర్లకు కేవలం 12.78 డాలర్లు అంటే 1,160 రూపాయలకే కట్టబెడుతున్నారని డోలేంద్ర ప్రసాద్ వివరించారు.
ఎంపరాడా వంటి సంస్థలకు మాత్రమే టెండర్లు దక్కేలా నిబంధనలను రూపొందించడమన్నది పక్కగా కుమ్మక్కై చేస్తున్న పనిగా ఆయన అభివర్ణించారు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ దోపిడీలో అధికార, విపక్ష పార్టీలు, బ్యూరోక్రసీ, కొన్ని మీడియా సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయన్నారు. ఒక చిన్న స్థాయి గుమాస్తా దగ్గరే కోట్లాది రూపాయల ఆస్తులు దొరుకుతున్నాయంటే, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఆస్తులు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
బారైటీస్ మాత్రమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలోని బీచ్ శాండ్ అలాగే అత్యంత విలువైన రేర్ ఎర్త్ ఖనిజాలు కూడా లూటీ అవుతున్నాయన్నారు.
చైనా నేడు ఈ రేర్ ఎర్త్ ఖనిజాలతోనే అమెరికా వంటి దేశాలను గడగడలాడిస్తోందనీ, అయితే మన దగ్గర ఉన్న ఈ అద్భుతమైన సంపదను పది రూపాయల కోసం రాజకీయ నాయకులు విదేశాలకు తరలిస్తున్నారని విమర్శించారు.
థోరియం వంటి దేశ రక్షణకు సంబంధించిన ఖనిజాలు కూడా అక్రమంగా తరలిపోతున్నాయన్నారు.ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రజలలో చైతన్యం రావాలని డోలేంద్రప్రసాద్ వాస్తవ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. మంగంపేట బారైటీస్ వంటి ఖనిజాలకు లోకల్ టెండర్లు కాకుండా గ్లోబల్ టెండర్లు పిలిస్తే రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.
రాష్ట్ర ఖనిజ సంపద ఆంధ్ర హక్కు అంటూ ప్రజాసంఘాలు నినదించాలనీ, బాధ్యత గల ప్రతి పౌరుడూ ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమంచాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల వల్ల సుమారు 140 పల్వరైజింగ్ మిల్లులు మూతపడే పరిస్థితిలో ఉన్నాయని, దీనివల్ల 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్న డోలేంద్ర ప్రసాద్ "ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కూటమి ప్రభుత్వమా కుమ్మక్కు ప్రభుత్వమా అని సందేహం వ్యక్తం చేశారు.
ఖనిజ దోపిడీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం తెలుగు వన్ న్యూస్ లో వాస్తవ వేదిక ఎనిమిదో ఎడిషన్ వీక్షించండి.