వైసీపీ స్వరం మారింది.. కేంద్రంతో ఎక్కడ చెడింది?
posted on Jul 29, 2022 7:32AM
వైసీపీ స్వరం మారింది. నిన్నటి దాకా వేనోళ్ల పొగుడుతూ మోడీకి బ్రహ్మరథం పట్టిన వైసీపీ ఇప్పుడు విమర్శల పల్లవి అందుకుంది. కేంద్రం సొమ్ములు ఇవ్వడం లేదు కనకనే పోలవరం ముంపు బాధితులను ఆదుకోలేకపోతున్నాం. పునరావాల ప్యాకేజీ ఇవ్వలేకపోతున్నాం అని జగన్ చెప్పిన రెండో రోజునే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కేంద్రం తీరుపై నిరసన గళం విప్పారు.
దేశంలోని ధనిక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పులు ఓ లేక్కా అని తేల్చేశారు. అసలు కేంద్రంలోని మోడీ సర్కార్ కంటే ఏపీలోని జగన్ సర్కార్ పాలన భేషుగ్గా ఉందంటూ కితాబిచ్చేశారు. హస్తినలో ఆయన గురువారం మీడియా సమావేవం ఏర్పాటు చేసి జగన్ వంటి సమర్థుడైన సీఎం ఉండటం ఏపీ ప్రజల అదృష్టం అన్నారు. శ్రీలంకలో జరిగిన పరిణామాలపై కేంద్ర ఆర్దిక మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రుల ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అసందర్భంగా దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్దిక పరిస్థితులపై ప్రజంటేషన్ ఇచ్చారని విజయసాయి విమర్శించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 6.9% ఉంటే ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు కేవలం 3.18% మాత్రమే ఉందని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్ర విధానాలే కారణమని నిందించారు. కేంద్రంపై విమర్శలు గుప్పించడానికి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటను ఎంచుకున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపేణా వచ్చిన మొత్తంలో 41% రాష్ట్రాలకు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది పూర్తిగా అవాస్తవమన్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ ఏం చెబుతూ వచ్చారో అదే చెప్పి విజయ సాయి కేంద్రం రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతోందని విమర్శించారు.కేంద్రం సెస్‌లు, సర్‌చార్జీల ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్రాలకు వచ్చేఆదాయాన్ని ప్రణాళికా బద్దంగా తగ్గించేస్తున్నదని అన్నారు. నిన్న మొన్నటి వరకూ అప్పుల కోసం దాదాపుగా పీఎంవోలోనే మకాం వేసినట్లుగా వ్యవహరించిన విజయసాయి..హఠాత్తుగా గళం మార్చడానికి ఇక కేంద్రం నుంచి అడ్డగోలుగా అప్పులకు అనుమతులు రావన్నది నిర్ధారణ కావడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదీ కాక ఎర్లీ ఎలక్షన్ల విషయంలో సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లేనని, ఇంకా కేంద్రాన్ని పొగడుతూ కూర్చుంటే రాష్ట్రంలో మనుగడ కష్టమన్న భావనతోనే వైసీపీ గళం సవరించుకుని కేంద్రంపై విమర్శలకు తెరలేపిందని అంటున్నారు. కానీ
గతంలో కేంద్రం ఏపీ విషయంలో తక్కువ చేసి మాట్లాడినా, ఏపీకి నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసినా ఆఖరికి విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడం తధ్యమని పార్లమెంటు సాక్షిగా ప్రకటించినా కిమ్మనని వైసీపీ నేతలు ఇప్పుడు కేంద్రంపై ఇలా రెచ్చిపోవడం వైసీపీ శ్రేణులనే ఆశ్చర్య పరుస్తోంది. కేంద్రంతో ఎక్కడ తేడా వచ్చిందా అని పార్టీ వర్గాలే తర్జనబర్జన పడుతున్నాయి.