పార్థా చటర్జీకి ఉద్వాసన పలికిన మమత
posted on Jul 29, 2022 6:51AM
టీచర్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో అరెస్టయిన పార్థా చటర్జీ మంత్రి పదవి ఊడింది. ఆయనకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. పార్థా చటర్జీ ఉద్వాసన తక్షణం అమలులోకి వస్తుందని చెప్పారు. టీచర్ల రిక్రూట్ మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా చటర్జీని ఈడీ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి విదితమే.
ఆయన తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడని చెబుతారు. అయితే టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఈడీ అధికారులు తనను అరెస్టు చేయడానికి ముందు ఆయన పలు మార్లు మమతా బెనర్జీకి ఫోన్ చేసినా ఆమె స్పందించలేదని అంటున్నారు.పార్థా చటర్జీ సన్నిహతురాలు అర్పిత ముఖర్జీ నివాసాలలో ఈడీ అధికారులు దాదాపు 50 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అర్పిత ముఖర్జీకి చెందిన రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అక్కడ స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి నాలుగు క్యాష్ కౌటింగ్ మిషన్లను ఉపయోగించారని చెబుతున్నారు. ఆ సొమ్ము లెక్కించడానికి దాదాపు 13 గంటలు పట్టిందంటున్నారు.
అమెకు చెందిన రెండు ఇళ్లలో లభించిన సొమ్ము 49.8 కోట్ల రూపాయలు అని చెబుతున్నారు. టీచర్ల నియామక కుంభకోణంలో పార్థా చటర్జీ అడ్డంగా దొరికిపోవడంతో బెంగాల్ లోని మమత సర్కార్ చిక్కుల్లో పడింది. పార్ఠా వ్యవహారంతో సంబంధం లేదని చెప్పుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. అందుకే ఆయనను కేబినెట్ నుంచి తొలగించింది. చట్టం తన పని తాను చేసుకు పోతుందని ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని చెప్పుకుంటోంది.
పార్థా చటర్జీ ఫోన్ కాల్స్ ను మమత ఆన్సర్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఏది ఏమైనా కుప్పలుగా పోసిన నోట్ల కట్టలు బయట పడడంతో, తృణమూల్ ప్రభుత్వంలో అవినీతి జనానికి తెలిసినట్లయ్యింది. ట్రక్కులలో తరలిస్తున్న నోట్ల కట్టలు తృణమూల్ నాయకత్వాన్ని డిఫెన్సులోకి నెట్టి వేశాయి. ఇదలా ఉంటే పార్థా కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాల్లో కుప్పలుగా పోసిన నోట్ల కట్టలతో పాటుగా, రాసులుగా పోసిన బంగారు ఆభరణాలు కూడా బయట పడటం సంచలనం సృష్టిస్తోంది.