ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు
posted on Jul 29, 2022 @ 9:58AM
ప్రపంచాన్ని మరోసారి కరోనా మహమ్మారి చుట్టేయనుందా? అంటే పరిస్థితులను గమనిస్తే ఔననే సమాధానం వస్తుంది. కోవిడ్ జన్మస్థలమైన చైనాలో మరోసారి కరోనా కోరలు సాచింది. చైనాలోని వూహాన్ ప్రావిన్స్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో మరోసారి కఠినమైన లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది ఆ దేశం.
జీరో కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ దాదాపు పది లక్షల మందిని క్వారంటైన్ చేసింది. జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు. రవాణ వ్యవస్థ స్తంభించింది. మరో వైపు అమెరికా, జపాన్ లలో కూడా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. అలాగే జపాన్ లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
మరో సారి ట్రావెల్ ఆంక్షలు విధించాలన్న యోచనలో ఆ దేశం ఉంది. జనాప్ లో కొత్తగా 1.80 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అగ్ర రాజ్యంలో 1.14 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే భారత్ లోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో కొత్తగా 20, 447 మంది కరోనా బారిన పడగా, 44 మంది మరణించారు.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 8. 79లక్షల549 కరోనా కేసులు నమోదయ్యాయి, 1,939 మంది కరోనా మహమ్మారి కాటుకు బలయ్యారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ కరోనా ప్రొటోకాల్ ను పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కాషనీర్ జారీ చేసింది.