Read more!

ప్రాణాధారమైన ఆహారాన్ని పొదుపు చెయ్యాల్సింది ఇప్పుడే..

ఈ భూమండలంపై ప్రతి జీవికి ఆహారమే ప్రాణాధారం. మనుషులైనా, జంతువులైనా, జలచరాలైనా వాటి ఆయువు ఆహారంతోనే ముడిపడి ఉంటుంది. ఇక భూమిపై అత్యంత తెలివైన ప్రాణిగా మనుగడ సాగిస్తున్న మనిషి జీవితంలో ఆహారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం పాకులాడుతున్నవారు ఎందరో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తూ చాలామంది సరైన ఆహారానికి నోచుకోలేకపోతున్నారు. పసిబిడ్డల నుంచి పెద్దవాళ్ల దాకా కడుపులు కాల్చుకుంటున్నారు. కోట్లాదిమంది పౌష్టికాహారం, తాగునీటికి ఆమడదూరంలో నిలుస్తున్నారు. ఈ దుర్భరపరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ దినోత్సవం అసలెప్పుడు మొదలైంది?, ఈ ఏడాది ఏ థీమ్‌తో వేడుకలు నిర్వహిస్తున్నారు? వంటి ఆసక్తికరమైన అంశాలను తెలుసుకంటే..

ఈ భూమిపై ప్రతి వ్యక్తికి సరైన పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీటికి భరోసా, అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని మొదలుపెట్టారు. ఆహార రక్షణ, ఆహార భద్రత, ప్రపంచవ్యాప్తంగా  ఆకలి సమస్యలను పారదోలడం ఈ మూడు  ఆహార దినోత్సవ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. గమ్యానికి అనుగుణంగా ప్రతి ఏడాది వినూత్న కార్యక్రమాల రూపొందిస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి.

తొలిసారి ఎప్పుడు ప్రారంభమైంది?

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి ఏడాది అక్టోబర్ 16న నిర్వహిస్తున్నారు. 1945లో ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ఏర్పాటైన అక్టోబర్ 16న  ‘ప్రపంచ ఆహార దినోత్సవాన్ని’ మొదలుపెట్టారు. నిజానికి ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ 1945లోనే ఏర్పాటైనప్పటికీ 34 ఏళ్ల తర్వాత అంటే 1979లో జరిగిన ఎఫ్ఏవో కాన్ఫరెన్స్‌లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాలు ఆహార దినోత్సవం నిర్వహణకు అంగీకారం తెలిపాయి. ఆకలి సమస్యలు, ఆహార భద్రతతో సంబంధమున్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్‌తోపాటు అనేక సంస్థలు ఈ దినోత్సవంలో పాల్గొంటాయి.

నీరు జీవితం, నీరే ఆహారం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి ఏడాది ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తారు. ‘‘నీరు జీవితం, నీరే ఆహారం. ఏ ఒక్కరినీ వెనుకబడనివ్వొద్దు’’ అనేది 2023 థీమ్‌గా ఉంది. ఈ భూమిపై జీవించడానికి నీరు చాలా ఆవశ్యకమని ఈ థీమ్ చాటి చెబుతోంది. భూమిపై మూడొంతులకుపైగా ఉండే నీరు మానవ శరీరాల్లో 50 శాతానికిపైగా ఉంటుందని, ఆహారోత్పత్తి, జీవనోపాధికి నీళ్లు ఎంతో ముఖ్యమని ఈ థీమ్ అవగాహన కల్పిస్తోంది. అత్యంత విలువైన ఈ సహజ వనరు అనంతమైనది కాదని, వృథాను మానుకోవాలనే ఉద్దేశ్యాన్ని చాటిచెప్పడం ఐక్యరాజ్యసమితి ప్రధానుద్దేశ్యంగా ఉంది. ఈ థీమ్‌కు తగ్గట్టు ప్రతి ఒక్కరికీ ఆహారం, నీరు సమాన ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు, సంస్థలు కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. భారత్‌లో కూడా అధికారికంగా ప్రపంచ ఆహార దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.


                                          *నిశ్శబ్ద.