Read more!

మెరుగైన ప్రపంచానికి మెరుగైన ప్రమాణాలు !

లీటర్ ఆయిల్.. కేజీ బియ్యం..  గంట సమయం.. స్వచ్ఛమైన బంగారం.. ఇలా ఒకటా! రెండా! రోజువారి జీవితంలో  పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు ప్రతిదానికి నిర్ధిష్ట పరిమాణం ఉంటుంది. అది పనైనా.. పదార్థమైనా.. నాణ్యతైనా ఒక గణన ఉంటుంది. ఆ నిర్ధిష్ట పరిమాణం లేదా గణనను ‘ప్రామాణికం’ అంటారు. ఈ ప్రామాణికాలు ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి తీసుకురావడానికి వేలాదిమంది శాస్త్రవేత్తలు స్వచ్ఛంధంగా కృషి చేశారు. ఇందుకోసం ఎన్నో ఒప్పందాలు కుదిరేలా కృషి చేశారు. వారందరి సేవలను గౌరవిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 14న అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.  శాస్త్రవేత్తల నిర్విరామ కృషి కారణంగా ఆవిర్బవించిన అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్, ఇంటర్నేషనల్ ఎథిక్స్ స్టాండర్డ్ బోర్డ్ ఫర్ అకౌంటెంట్స్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ వంటి సంస్థలన్నీ అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవంలో పాల్గొంటాయి. ఈ దినోత్సవం ఆవశ్యకతను చాటి చెప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి.

ప్రాముఖ్యత ఏంటంటే...

ప్రతి దినోత్సవాన్ని నిర్వహించడానికి ఒక లక్ష్యం ఉన్నట్టే అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహించడానికి ఒక కారణం ఉంది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో ప్రామాణికీకరణ అవశ్యకత గురించి నియంత్రణ సంస్థలు, పరిశ్రమల రంగం, వినియోగదారుల్లో అవగాహన పెంపొందించడం కోసం ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే అక్టోబర్ 14నే ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారటే.. ప్రామాణికీకరణకు ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని 25 దేశాలకు చెందిన ప్రతినిధులు అక్టోబర్ 14, 1946లో నిర్ణయించారు. కీలకమైన ఈ సమావేశం లండన్‌లో జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి అత్యంత కీలకమైన ఈ రోజున అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి లండన్ సమావేశం జరిగిన మరుసటి ఏడాది ఐఎస్‌వో (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) ఏర్పాటైంది. అయితే తొలి అంతర్జాతీయ ప్రామాణిక దినోత్సవం 1970లోనే నిర్వహించారు. ప్రపంచదేశాలు తమతమ దేశాల్లో ప్రమాణాలను కూడా నిర్ణయించడంతో అక్టోబర్ 14న ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. కాగా ఐఎస్‌వోలో మొత్తం 125 సభ్యదేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ తమతమ దేశాల్లో ప్రమాణాల ఆవశ్యకత గురించి అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తుంటాయి.

ఈ ఏడాది థీమ్ ఏంటంటే....

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ప్రతి ఏడాది ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తారు.“మెరుగైన ప్రపంచం కోసం భాగస్వామ్య దృష్టి: ఎస్‌డీజీ3 సమ్మిళితం” అనేది 2023 థీమ్‌. కాగా ఎస్‌డీజీ3 అంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్3 అని అర్థం. ఆరోగ్యకరమైన జీవితాలకు భరోసా, అందరికీ శ్రేయస్సును ప్రోత్సహించడం ఈ థీమ్ ప్రధాన ఉద్దేశ్యం. అంతర్జాతీయ ఆహార ప్రమాణాల నిర్దేశక సంస్థగా కోడెక్స్ అలిమెంటారియస్ ఈ ఏడాది ‘‘అందరి శ్రేయస్సు, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ మెరుగైన, ఉత్తమమైన, మరింత సుస్థిరమైన ప్రపంచం’’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో డబ్ల్యూహెచ్‌వో/ఎఫ్ఏవో దీనిని ఈ ఏడాది థీమ్‌గా పరిగణించాయి. కాగా కొన్ని దేశాల్లో వేర్వేరు రోజులు అంతర్జాతీయ ప్రమాణాలు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక ఇండియా విషయానికి వస్తే 1947లో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ చట్టాన్ని ఆమోదించి దానిని శాసనపరమైన సంస్థగా మార్చి ఐ.ఎస్‌.ఐ ముద్రను ప్రకటించిన విషయం తెలిసిందే.


                                       *నిశ్శబ్ద.