ఆడవారు ఎక్కువసేపు ఉద్యోగం చేస్తే!
posted on Jun 24, 2016 @ 11:41AM
మారుతున్న సమాజంలో స్పష్టంగా కనిపించే అంశం... ఆడవారు కూడా ఉద్యోగసోపానంలో ఉన్నత శిఖరాలను అందుకోవడం! మరి తమను తాము నిరూపించుకునే క్రమంలో వారు ఛేదిస్తున్న లక్ష్యాలతో పాటుగా వెంటాడుతున్న అనారోగ్యాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు.
ఆదివారం మినహా రోజుకి పదేసిగంటలపాటు ఉద్యోగం చేస్తూ ఉంటే... ఎవరికైనా చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు రావడం సహజం. అలాంటివారు అజీర్ణం, ఊబకాయం... లాంటి అనారోగ్యాలను గమనించుకోక తప్పదు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ‘అలార్డ్’ అనే పరిశోధకుడు పూనుకున్నాడు. తన పరిశోధన కోసం దాదాపు 7,500 ఉద్యోగులను మూడు దశాబ్దాల పాటుగా గమనించాడు. వీళ్లలో గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, ఉబ్బసం, రక్తపోటు, డిప్రెషన్ లాంటి సమస్యలు ఏర్పడటానికీ... పనిగంటలకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందా అని పరిశీలించాడు.
అలార్డ్ పరిశోధనల్లో... పనిగంటలకీ, పైన పేర్కొన్న వ్యాధులకీ కొంత సంబంధం ఉందని తేలింది. అయితే విచిత్రంగా ఆడవారిలో ఈ సంబంధం మరింత స్పష్టంగా కనిపించింది. ఇలా ఎందుకు జరుగుతోందన్న దాని మీద అలార్డ్ దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోయింది. ‘బహుశా ఉద్యోగిగా, గృహిణిగా, తల్లిగా... ఇన్ని బాధ్యతలను ఒక్కసారిగా సమర్థవంతంగా మోయాలనుకునే ప్రయత్నంలో వారి ఆరోగ్యం త్వరగా దెబ్బతింటోందేమో’ అని ఊహిస్తున్నారు అలార్డ్. అయితే డా॥ గోల్డ్‌బర్గ్ అనే వైద్యరాలు మాత్రం అధికపనిగంటల వల్ల ఆడవారు అనారోగ్యం పాలవ్వడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు.
పని ఒత్తిడిలో పడిపోయి ఆడవారు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరనీ. స్త్రీలకు అవసరమైన మేమోగ్రాం వంటి పరీక్షలు చేయించుకునేందుకు కూడా అశ్రద్ధ చూపిస్తూ ఉంటారనీ గోల్డ్‌బర్గ్ విశ్లేషిస్తున్నారు. అంతేకాదు! ఉద్యోగం చేసే ఆడవారు ఆకలిని తీర్చుకునేందుకు ఏదో ఒక చిరుతిండితో సరిపెట్టేసుకుంటారనీ అంటున్నారు.
మరి అధిక పనిగంటలు ఉన్నాయి కదా అని ఆడవారు ఉద్యోగాలలో వెనుకంజ వేయాలా? అంటే అదేమీ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఉద్యోగ బాధ్యతలలో ఏది అవసరం, ఏది అనవసరం అని బేరీజు వేసుకుని అనవసరమైన బాధ్యతలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రోజులో కాస్త సమయాన్నైనా తమకోసం వెచ్చించుకోవాలని సలహా ఇస్తున్నారు. వ్యాయామం చేయడమో, పుస్తకాలు చదవడమో, టీవీతో కాలక్షేపం చేయడమో, ధ్యానంలో ఉండటమో... ఇలా ఉద్యోగపరమైన ఆలోచనల నుంచి కాసేపు మనసుకి విశ్రాంతిని కలిగించమంటున్నారు.
- నిర్జర.