ఓట్స్ అంటే ఔషధమే!

ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో పాటుగా ఓట్స్ వాడకం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఓట్స్‌ అంటే తెలియనివారు ఉండరు. నిజానికి ఓట్స్ మన దేశానికి చెందిన పంట కాదు. ఐరోపా, పశ్చిమాసియా దేశాలలో వేల సంవత్సరాలుగా దీనిని పండిస్తూ వచ్చారు. అయితే దీనిని ఎక్కువగా పశువుల దాణాగానే ఉపయోగించేవారు. గుర్రాలు వేగంగా పరుగులెత్తేందుకు కావల్సిన శక్తిని అందించే ఆహారంగా దీన్ని భావించేవారు. 19వ శతాబ్దం నాటికి నిదానంగా ఓట్స్‌ పోషక విలువలు అర్థం కాసాగాయి. ఓట్స్‌తో బ్రెడ్‌ల తయారీ మొదలైంది.

 

పోషకాలే పోషకాలు!:  ఓట్స్‌ ఏడాది పొడవునా పెరిగే పంట. ఎంతటి వర్షపాతాన్నయినా తట్టుకుని పండే సత్తా దీనికి ఉంది. ఇక ఓట్స్‌లో ఉండే పోషక విలువల గురించి చెప్పనే అక్కర్లేదు. విటమిన్లు అందునా ‘బి’ విటమిన్లలో ఉండే అన్ని విభాగాలూ (B1, B2, B3, B5, B6, B9) ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇక కార్బోహైడ్రేట్స్‌, మాంసకృత్తులు, ఖనిజాల సంగతి అయితే చెప్పనవసరం లేదు. అందుకే హోమియోపతిలో సైతం దీనిని ‘అవీన సటీవా’ పేరుతో విస్తృతంగా వాడుతూ ఉంటారు. నిస్సత్తువ, నరాల బలహీనతా, గుండె జబ్బులు... వంటి అనేక సమస్యలలో అవీనా సటీవా అద్భుతంగా పనిచేస్తుంని హోమియోపతి వైద్యులు నమ్ముతారు.

 

కొవ్వుని కరిగిస్తుంది:  ఊబకాయం తగ్గాలంటే ఓట్స్‌ గొప్ప ఆహారం అని జనం భావించడం వెనుక శాస్త్రీయత లేకపోలేదు. చాలా తక్కువ పదార్థాలలో ఉండే beta-glucan అనే పీచు పదార్థం ఓట్స్‌లో కనిపిస్తుంది. ఈ beta-glucan చెడు కొవ్వుని కరిగించి, అది రక్తంలో పేరుకోకుండా చేస్తుంది. పైగా ఆహారం శుభ్రంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. ఒక గుప్పెడు ఓట్స్‌ తీసుకున్నా కూడా అందులో ఉన్న beta-glucan అటు కొవ్వుని కరిగించేందుకు, ఇటు జీర్ణశక్తికి మెరుగుపరిచేందుకు సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. పైగా శరీరంలో క్రిముల వల్ల ఏర్పడే ఇన్షెక్షన్లను కూడా ఈ beta-glucan ఎదుర్కొంటుందని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి.

 

రక్తపోటుని నియంత్రిస్తుంది:  ఒక 40 గ్రాముల ఓట్స్‌లో రోజుకి సరిపడా మెగ్నీషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. దానివల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు! రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. అంటే తరచూ ఓట్స్‌ను తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుందన్నమాట.

 

ఇతర తృణధాన్యాలు తినలేనప్పుడు:  కొంతమందికి గోధుమలు, బార్లీ వంటి తృణధాన్యాలు సరిపడవు. ఇందులో ఉండే గ్లూటెన్ అనే మాంసకృత్తుల సముదాయం వల్ల వారిలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ పదార్థాలన్నింటికీ దూరంగా ఉండటం వల్ల, మనకి కావల్సిన పోషకాల నుంచి దూరమవుతాం కదా! చిత్రంగా ఓట్స్‌లో గ్లూటెన్ ఉన్నప్పటికీ, అది ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించడం లేదని తేలింది.

 

ఇంతేకాదు... ఆస్తమా మొదలుకొని క్యాన్సర్‌ వరకూ ఓట్స్‌ ఎన్నోరకమైన అనారోగ్యాలు తలెత్తకుండా ఉండేందుకూ, శరీరంలో ఉన్న రుగ్మతల నుంచి స్వస్థత పొందేందుకూ ఒక ఔషధిలాగా పనిచేస్తుందని తరచూ ఏదో ఒక పరిశోధన రుజువు చేస్తోంది. మరెందుకాలస్యం. మన రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను కూడా చేర్చేసుకుంటే సరి!

 

- నిర్జర