విజయ ‘చంద్ర’ హాసమే!
posted on Jul 30, 2022 @ 12:17PM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిలో జోష్ చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయకేతనం ఎగరేయడం ఖాయం అనే అభిప్రాయం జనంలో వ్యక్తం అవుతోంది. వైసీపీ సర్కార్ లోపాలను, అవినీతి, అక్రమాలపై అటు తన ట్విట్టర్ వేదికగా తూర్పారపట్టడంతో పాటుగా పన్నులు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు, చెత్త మీద పన్ను లాంటి జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ’బాదుడే బాదుడు’ కార్యక్రమంతో టీడీపీ శ్రేణులు, నేతలను జనం మధ్యకు పంపారు చంద్రబాబు. దాంతో పాటుగా తాను స్యయంగా జిల్లాలను చుట్టి వస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పాదయాత్రకు రంగం సిద్ధం చేస్తున్నారు.
మరో పక్కన ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు, పెద్ద ఎత్తున సంభవించిన వరదలతో అల్లాడిపోయిన కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ కంటే ముందే.. ప్రమాదాలకు ఎదురెళ్లి మరీ సందర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు చొరవను చూసిన గోదావరి వరద ముంపు ప్రాంతాల ప్రజలు తమ బాధల్ని మర్చిపోయి సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.
ఇక పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను సందర్శన సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుందని చెప్పక తప్పదు. ముంపు గ్రామాలన్నింటినీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పడంతో ఇకపై ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. టీడీపీ అధికారంలోకి రాగానే చింటూరు ఐటీడీఏ, ఎటపాక డివిజన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించలేక వైసీపీ సర్కార్ చేతులెత్తేయడంపై చంద్రబాబు నిప్పుల చెరిగారు. కేంద్రం ఇస్తేనే గానీ పరిహారం ఇవ్వడం చేతగాని దద్దమ్మ సీఎం అంటూ ఆయన తూర్పార పట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి ఎందుకు రావో తేలుస్తానంటూ హెచ్చరించడం విశేషం. ఒక వ్యూహం, ప్రణాళిక లేకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ తీరు వల్లే నిధులు కేటాయించలేకపోతున్నట్లు కేంద్ర మంత్రులు చెప్పడాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ఉటంకించారు.
ఏపీలో అభివృద్ధి పనులేవీ నిర్వహించకుండా.. అప్పుల ఊబిలో ప్రజల్ని దింపేసిన జగన్ సర్కార్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తున్న క్రమంలో చంద్రబాబు పరిపాలన, ఆయన అనుభవాలే ఏపీకి దిక్కు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చినట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఏపీలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా తాను స్వయంగా జనంలోకి చొచ్చుకుపోవడమే కాకుండా.. టీడీపీ నేతలు, శ్రేణులను బాధితులకు అండగా నిలపడంలో చంద్రబాబు ముందే ఉంటున్నారు. ఒక పక్కన వరద బాధిత ప్రాంతాల్లో జగన్ గాల్లోనే తిరుగుతుంటే.. చంద్రబాబు మాత్రం వరద, బురదతో నిండిపోయి, బాధలు అనుభవిస్తున్న జనం మధ్యలోనే ఉంటున్న తీరును ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. గతంలో హుద్ హుద్ తుపాను సమయంలో, తిత్లీ తుపాను వచ్చినప్పుడు చంద్రబాబు స్వయంగా బాధిత ప్రాంతాల్లోనే మకాం వేసి మరీ సహాయక, పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించిన వైనాన్ని జనం ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.
సీఎం జగనే స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా వైసీపీ సర్కార్ కు, జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యక్తం అవుతున్న తీవ్ర వ్యతిరేకత గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఇంకో పక్కన టీడీపీ, చంద్రబాబు నాయుడి గ్రాఫ్ పెరుగుతుండడం గమనార్హం. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయం ఖాయమని, సీఎంగానే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతా అచి చంద్రబాబు చేసిన ప్రతిజ్ఞ నెరవేరే సమయం త్వరలోనే రానుందని అంటున్నారు. ఒక పక్కక పరిపాలన చేతకాక జగన్ చేతులెత్తేయడాన్ని, మరో పక్కన చైతన్యంతో చంద్రబాబు తిరుగుతున్న తీరు, ఆయనలో కనిపిస్తున్న గెలుపు ధీమాను చూస్తున్న జనం, రాజకీయ పండితులు కూడా వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పుకుంటున్నారు.