నడి సంద్రంలో కాంగ్రెస్.. రాహుల్ గట్డెక్కించేనా?
posted on Jan 9, 2023 @ 11:21AM
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ గత రెండు పర్యాయాలుగా సార్వత్రిక ఎన్నికలతో ఓటమితో ఇప్పుడు దయనీయ స్థితిలో ఉంది. ఒకప్పుడు ఎదురు లేని అధికారం అనుభవించిన ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికలలో గెలుపు అంటేనే మరిచిపోయిన పరిస్థితిలో పడింది. యావద్దేశంలో కేవలం మూడంటే మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. ఆ పార్టీ ప్రస్తుత దుస్థితికి కారణాలేమిటన్నది పక్కన పెడితే.. కాంగ్రెస్ అంటేనే గాంధీలు.. గాంధీలంటేనే కాంగ్రెస్ అన్నట్లుగా ఆ పార్టీ గుర్తింపు పరిమితమైంది.
ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి చేపట్టినా గుర్తింపులో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. అందుకే ఇప్పుడు కూడా పార్టీని అధికారంలోకి తీసుకు రావాలంటే.. ఆ పని చేయగలిగిన వ్యక్తి కేవలం రాహుల్ గాంధీ మాత్రమేనని ఆ పార్టీ యావత్తూ భావిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణగా సల్మాన్ ఖుర్షీద్ వంటి వారు నిత్యం గాంధీ కుటుంబ నామస్మరణ చేస్తూ, ఖర్గేను ఖాతరు చేయకపోవడమే. ఇది ఖర్గేతో సహా మనందరికీ తెలిసి బహిరంగ రహస్యమే. పైగా ఖర్గేది కేవలం అలంకారప్రాయమైన అత్యున్నత పదవి మాత్రమే. గాంధీ కుటుంబ వీర విధేయతకు దక్కిన నామమాత్రపు బహుమానంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
ఇక విషయానికి వస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఏకైక హోప్, ఆ పార్టీ ముఖచిత్రం, ప్రధాని అభ్యర్థి ఎవరంటే.. సందేహాలకు తావు లేకుండా అందరూ చెప్పే పేరు రాహుల్ గాంధీ. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు కమలనాథ్ ప్రకటించేశారు కూడా. పైగా కాంగ్రెస్ తో కూటమి కట్టే పార్టీలు ముందుకు వస్తే విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి కూడా రాహుల్ గాంధీనే అంటూ ఇంకా పొత్తు చర్చలు ప్రారంభంకాకుండానే కమల్ నాథ్ కుండ బద్దలు కొట్టేశారు. పార్టీలో కొత్త జోష్ నింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నా.. అధ్యక్ష స్థాయి కంటే తక్కువ పదవిలో ఇమడని, ఇమడలేని ఇమేజ్ ఉన్నపార్టీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు పార్టీ అత్యున్నత నిర్ణయాక కమిటీ సీడబ్ల్యూసీ లో శాశ్వత సభ్యులుగా నియమించే యోచన చేస్తోంది. అలా చేయడం ద్వారా వారి నిర్ణయాలను పార్టీ శిరోధార్యంగా మోసే అవకాశం లభిస్తుందన్నది పార్టీ హైకమాండ్ (అంటే మరేదో బ్రహ్మ పదార్దంకాదు. గాంధీ కుటుంబమే.) ఉద్దేశం. అలా అయితేనే ఉత్తరోత్తరా పార్టీలో ఎలాంటి పరిణామాలు సంభవించినా సోనియా, రాహుల్ స్థానాలకు, హోదాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉంటుంది.
వచ్చే నెల అంటే ఫిబ్రవరి 24-26 తేదీల్లో రాయపూర్ లో జరిగే కీలక ప్లీనరీ సమావేశాల్లో మల్లికార్జున్ ఖర్గేను పార్టీ అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు కొనసాగిస్తున్నట్లు పునరుద్ఘాటిస్తూ ప్రకటించనుంది. అలాగే పార్టీకి సంబంధించిన పొలిటికల్, ఎకనామిక్, ఇంటర్నేషనల్ అఫైర్స్, వ్యవసాయ, రైతు, , సామాజిక న్యాయ, విద్య, ఉపాధి వంటి అంశాలపై పార్టీ విధానాలను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఈ ప్లీనరీ వేదికగానే పార్టీ సమర శంఖారావం మోగించే అవకాశం ఉంది. మూడు రోజులపాటు సాగే 85వ ప్లీనరీ సమావేశాలు పార్టీకి సరి కొత్త దశ-దిశను నిర్దేశిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీడబ్ల్యూసీని కాంగ్రెస్ అధ్యక్షుడే నామినేట్ చేస్తారు, ఒకవేళ ఎన్నికలు అనివార్యం అనుకుంటే ఈ ప్లీనరీలోనే దానిని కూడా మమ అనిపించేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సాధారణంగా ఉండేది.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, 23 మంది ఇతర సభ్యులు..వీరిలో 12 మందిని ఏఐసీసీ ఎంపిక చేసుకుంటుంది. మిగతావారిని పార్టీ అధ్యక్షుడే నామినేట్ చేసి అపాయింట్ చేస్తారు.
ఓవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కు బహుళ జనాదరణ లభిస్తోంది. రాహుల్ కు ఆదరణ, అభిమానం పెరుగుతోంది. మరోవైపు ఈమధ్య కాలంలో మొట్టమొదటిసారి పార్టీపై యువకుల్లో, సెలబ్రిటీల్లో సానుకూలత లభిస్తోంది. అది కూడా రాహుల్ పాదయాత్ర వల్లే. దీంతో తన పాదయాత్రను కొనసాగిస్తూ భారత్ జోడోయాత్ర 2.0 ద్వారా నిత్యం ప్రజల్లో ఉండేలా రాహుల్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని అంటున్నారు. దీంతో వచ్చే ఏడాది ఎన్నికలు సమీపించే వరకూ రాహుల్ ప్రజల మధ్యే ఉండేలా కార్యాచరణ రూపొందుతోందని చెప్పొచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ ను ఒడ్డుకు చేర్చాలంటే ఆ పార్టీకి ఉన్న ఏకైక హోప్ రాహుల్ మాత్రమే. జోడో యాత్ర ద్వారా తనకు లభిస్తున్న ఆరణను రాహుల్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వీలుగా మలచు కుంటారా అంటే వేచి చూడాల్సిందే అన్న సమాధానమేవస్తుంది.