జోడో యాత్రలో జోష్.. ఆజాద్ కు షాక్ ?
posted on Jan 9, 2023 @ 1:08PM
కాంగ్రెస్ పార్టీతో ఉన్న 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని, సొంత కుంపటి పెట్టుకున్న, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాబ్ నబీ ఆజాద్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వెంట కాంగ్రెస్ చేయి వదిలి వచ్చిన 19 మంది నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 17 మంది నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వ్యక్తిగత కారణాలతో ఇద్దరు నేతలు రాలేకపోయారని.. త్వరలో వారు కూడా కాంగ్రెస్‌లో చేరతారని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు.
ఒకప్పుడు కాంగ్రీస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన గులాం నబీ ఆజాద్ 2019 ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ అధిష్టానంపై తిర్గుబాటు జెండా ఎగరేసిన జీ 23లో కీలక భూమిక పోషించారు. ఇంచుమించుగా రెండు సంవత్సరాలకు పైగా అసమ్మతి. గళం వినిపించిన ఆజాద్, మూడు నెలల కిందట కాంగ్రెస్ పార్టీని వీడి తమ స్వరాష్ట్రం జమ్మూ కశ్మీర్ లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ(డీఏపీ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే మాజీ మంత్రులు, మరి కొందరు ముఖ్య నేతలు ఆయన వెంట కాంగ్రెస్ కు గుడ్బై చెప్పారు. డీఏపీలో చేరారు. అయితే, గులాం నబీ వెంట వెళ్ళిన నేతలందరు తాజాగా గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా సొంత గూటికి చేరారు.
అజాద్ వెంట వెళ్ళిన 19 మంది ముఖ్య నేతల్లో 17 మంది స్వగృహ ప్రవేశం చేశారు. మరో ఇద్దరు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని నాయకులు అంటున్నారు. సొంతగూటికి తిరిగొచ్చిన వారిలో జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పిర్జాదీ సయీద్ కూడా ఉన్నారు.
అదలా ఉంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో ప్రవేశించనున్న సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామం హస్తం పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. కాగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరో రెండు వారాల్లో జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించనున్న సమయంలో ఈ చేరికలు జరగడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర విజయవంతం అయిన నేపధ్యంలో పార్టీని వీడిన నేతలందరూ తిరిగి పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ నేతలందరూ 2 నెలల పాటు కాంగ్రెస్ సెలవుల్లోకి వెళ్లినట్లు భావిస్తాం. ఇది ఆరంభం మాత్రమే. జమ్మూ కాశ్మీర్‌లోకి యాత్ర ప్రవేశించాక మరిన్ని చేరికలు ఉంటాయి అని కేసీ వేణుగోపాల్ అన్నారు.
నిజానికి, గులాం నబీ అజాద్ కూడా తిరిగి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని వార్తలు వచ్చినా, అజాద్ ఆ వార్తలను ఖండించారు. అయితే భారత్ జోడో యాత్రలో ఆజాద్ పాల్గొనే అవకాం లేక పోలేదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. అదలా ఉంటే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న జమ్మూ కశ్మీర్ లో భారత్ జోడో యాత్రకు నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్డుల్లా, పీడీపీ అగ్ర నాయకురాలు, మరో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా ఇతర చిన్న చితక ప్రాంతీయ పార్టీలన్నీ మద్దతు నిస్తున్నాయి. మరోవంక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు వచ్చింది.
ఈ యాత్ర రెండు రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో అడుగుపెట్టనుంది. ఆక్కడి నుంచి జమ్మూ కశ్మీర్లో ప్రవేశించి, జనవరి 26 కు ముగుస్తుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరుకూ సాగుతున్న ఈ యాత్ర అనంతరం, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మరో యాత్రకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ యాత్ర రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీ వాద్రా చేపట్టనున్నట్లు తెలుస్తోంది.