విపక్ష నేతల ప్రసంగాల స్క్రిప్టు కూడా పోలీసులే డిసైడ్ చేస్తారా?
posted on Aug 12, 2023 @ 11:17AM
ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏమైనా మాట్లా డొచ్చు.. ఎక్కడికైనాన వెళ్లొచ్చు. అదే విపక్ష నాయకుల దగ్గరకు వచ్చేసరికి వారెక్కడ పర్యటించాలో , వారే దారిలో వెళ్లాలో ప్రభుత్వం లేదా పోలీసులు.. వాస్తవానికి ప్రభుత్వమే పోలీసు వ్యవస్థను శాసిస్తోంది. ప్రభుత్వం ఏం చెబితే పోలీసు వ్యవస్థ అదే చేస్తున్న దుస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సమీపించే కొద్దీ ఇక విపక్ష నేతలు ఏం మాట్లాడాలో కూడా పోలీసులే చెప్పే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా గానీ, తాజాగా పవన్ కల్యాణ్ వారాహీయాత్రలో భాగంగా విశాఖలో జరిగిన సంఘటనలు చూస్తే రానున్న రోజులలో అదే జరుగుతుందని అనిపించక మానదు. పవన్ యాత్ర రోడ్డుకు ఎటు వైపు వెళ్లాలో.. ఆయన వెంట ఎంత మంది ప్రజలు ఉండాలో ఇత్యాది విషయాలన్నిటినీ పోలీసులే నిర్ణయించేశారు. ఇక సముద్ర తీర ప్రాంతమైన రిషి కొండలో జగన్ వినా మరెవ్వరూ ఉండటానికి వీల్లేదంటూ కండీషన్ పెట్టారు. ఈ మేరకు పవన్ కు నోటీసులూ జారీ చేశారు. ఆయన రోడ్డు కు ఎడమవైపు మాత్రమే పర్యటించాలనీ, కుడివైపునకు వెళ్లకూడదనీ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అసలు ఆయన విశాఖలో రోడ్ షో చేయడానికే వీళ్లేదనీ, నేరుగా సభావేదిక వద్దకు వెళ్లి ప్రసంగించి వెళ్లిపోవాలనీ హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో విపక్షాల మూవ్ మెంట్ ను నియంత్రించి.. నియంత్రించి అనేమిటి అసలు లేకుండా చేసి.. ప్రభుత్వ వ్యతిరేక గళాలు ప్రజలకు చేరకుండా చేయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ రాష్ట్రాన్ని ఆంక్షల చట్రంలో బిగించేందుకు ప్రయత్నిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన నిలుచున్న స్టూల్, ఆయన కోసం ఉన్న ప్రచార రథాలను సీజ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అలాగే గతంలో చంద్రబాబు అనపర్తి, కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరునూ ప్రస్తావిస్తున్నారు. రానున్న రోజులలో విపక్ష నేతలు మాట్లాడాల్సిన ప్రసంగం స్క్రిప్టును కూడా పోలీసులో, సకల శాఖల మంత్రో రాసి అదే చదవాలని ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు.