ప్రాజెక్టులు పడక.. అభివృద్ధి మునక.. జగన్ హయాంలో జరిగిందిదేనా?
posted on Aug 12, 2023 @ 10:37AM
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలోని కొత్తూరులో ముగిసింది. కొత్తూరులో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. ఆ జనవాహిని పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడు కోసం జనం కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారని అనిపించక మానదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జనసందోహాన్ని చూస్తే ముఖ్యమంత్రికి గుండె ఆగిపోతుందేమోనని చంద్రబాబు అన్నారంటూ తెలుగుదేశం అంచనాలకు మించి ఆ సభకు జనం హాజరయ్యారని ఇట్లే అవగతమౌతుంది. అయితే పరిశీలకులు మాత్రం అధికారంలోని జగన్ సర్కార్ పై చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ ఏకకాలంలో చేస్తున్న ముప్పేట దాడితో ఇప్పటికే వైసీపీ గుండె శ్వాస ఆగిపోయినట్లుగా అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు, విసురుతున్న సవాళ్లకు అధికారం పార్టీ నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదు. ఎంత సేపూ విమర్శలకు సాహానం ఇవ్వకుండా, సవాళ్లకు స్పందించకుండా ఎదుటి వారి పై దూషణలతో సరిపుచ్చేయడమంటే.. విపక్ష నేతలు ప్రస్తావిస్తున్న సమస్యలు, సవాళ్లకు వారి వద్ద జవాబు లేదని భావించాల్సి వస్తోందని అంటున్నారు.
పుంగనూరులో చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. పోలీసులు మాత్రం చంద్రబాబు సహా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారు. అక్కడితో ఆగకుండా కోనసీమలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ తెలుగుదేశం వాళ్లు అధికారంలోకి వస్తే తనను ఖతం చేస్తానంటున్నారంటూ జనం ముందు దీన స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక వైపు చంద్రబాబు తన యాత్ర ద్వారా రాష్ట్రంలో జగన్ హయాంలో ప్రాజెక్టులు ఎలా పడకేశాయో, రైతులు ఎలా నష్టపోయారో వివరిస్తుంటే.. వాటికి సమాధానాలు చెప్పడం మాని ఆరోపణలు, విమర్శలు, దూషణలకే ముఖ్యమంత్రి పరిమితం కావడం ద్వారా.. ఈ నాలుగేళ్లలో త ప్రగతి, అభివృద్ధి విషయంలో తన ప్రభుత్వం చేసింది ఇదీ అని చెప్పుకోవడానికేమీ లేదని పరోక్షంగా అంగీకరించడమేనని పరిశీలకులు అంటున్నారు.