అలిపిరి నడక మార్గంలో చిన్నారిని బలితీసుకున్న చిరుత
posted on Aug 12, 2023 @ 12:32PM
తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రత గాలిలో దీపంగా మారింది. తరచుగా ఆ మార్గంలో వన్యమృగాల సంచారాన్ని గుర్తించినప్పటికీ అవసరమైన భద్రతా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం టీటీడీ ఘోరంగా విఫలమౌతున్నది. ఇప్పటి వరకూ పలు సంఘటనల్లో వన్యమృగాల దాడిలో భక్తుల గాయపడిన సంఘటనలు చూశాం కానీ తాజాగా చిరుతపులి దాడిలో ఓ ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది.
అలిపిరినడక మార్గంలో వెళ్తుండగా ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. తిరుమలకు వెళ్తుండగా చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు నడకదారిలో వెడుతున్న ఓ కుటుంబం బిడ్డను కోల్పోవడం అంత్యంత విషాదం
నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అలిపిరి నడకమార్గం ద్వారా కొండపైకి బయలుదేరింది. అర్థరాత్రికి కొంచం ముందు అంటే రాత్రి పదకొండు గంటల సమయానికి ఆ కుటుంబం లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకుంది. ఆ సమయంలోనే వారి ఆరేళ్ల పాప లక్షిత కనిపించకుండా పోయింది. కంగారుపడిన కుటుంబం ఆమె కోసం ఆ ప్రాంతం అంతా గాలించింది. ఫలితం లేకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేఇశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తరువాత అడవిలో గాలింపు చేపట్టారు. ఫారెస్టు సిబ్బంది సహకారంతో అడవిలో గాలింపు చేపట్టగా చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలో ఆ చిన్నారి మరణించిందని నిర్ధారించారు.
తిరుమల నడకదారిలో చిరుత దాడులు దాదాపుగా నిత్యకృత్యమయ్యాయి. ఈ ఏడాది జూన్ 23న కూడా ఇటువంి సంఘటనే జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ కు చెందిన కుటుంబం నడకదారిలో శ్రీవారి కొండపైకి వెడుతుండగా ఏడో మైలు రాయి వద్ద చిరుత దాడి చేసి వారి ఐదేళ్ల కుమారుడు కౌశిక్ ను నోట కరచుకుని అడవిలోకి పారిపోయింది. అయితే కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత భయపడి కౌశిక్ ను వదిలేసి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన కౌశిక్ ఆ తరువాత ఆస్పత్రిలో కోలుకున్నాడు.
ఈ సంఘటన తరువాత టీటీడీ అధికారులు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు పలు జాగ్రత్తలు సూచించారు. గుంపులుగా వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే భక్తుల భద్రత కోసం అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామనీ చెప్పారు. అయితే అవేమీ పెద్దగా ఫలితమివ్వలేదని తాజా ఘటన ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటికైనా అలిపిరి నడక మార్గంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.