చావనైనా చస్తా కానీ కాంగ్రెస్ లో చేరను.. గడ్కరీ
posted on Aug 30, 2022 @ 10:40AM
నితిన్ గడ్కరీ.. బీజేపీలో నిన్న మొన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన నేత. నాగపూర్ సంబంధాలతో పార్టీలో, ప్రభుత్వంలో మోడీతో సమానుడిగా అంతా భావించిన నాయకుడు. ఒక సమయంలో మోడీకి ప్రత్యామ్నాయం ఎవరన్న చర్చ వచ్చినప్పుడు నిర్ద్వంద్వంగా అంతా గడ్కరీ పేరే చెప్పారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న నాయకుడు నేడు బీజేపీలో ఎవరికీ కొరగాని నేతగా మారిపోయారు.
అందుకు మోడీషా మ్యాజిక్కే కారణమన్న విమర్శలు, అభిప్రాయాలూ వెల్లువలా వ్యక్తమయ్యాయి. అందుకు గడ్కరీ స్వయంకృతం కూడా కొంత వరకూ కారణమన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లోనే వ్యక్తమైంది. మోడీ కేబినెట్ లో స్వతంత్రంగా వ్యవహరించే ఏకైక మంత్రిగా గడ్కరీకి తిరుగులేని గుర్తింపు ఉంది. ఆ స్వతంత్ర వైఖరే మోడీ, షా ద్వయానికి రుచించలేదని పరిశీలకులు అంటారు. మోడీ ప్రమేయం లేకుండానే బీజేపీయేతర రాష్ట్రాలలో జాతీయ రహదారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, రైల్వే లైన్లకు ఓకే చెప్పేయడం వంటి చర్యలతో మోడీ షా ద్వయానికి గడ్కరీ దూరమయ్యారని అంటారు.
ఆ కారణంగానే ఆయనకు ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోయింది. ఆ అసంతృప్తితోనే రాజకీయాలంటే అధికారమేనా, సేవ కాదా అంటూ నిర్వేదంతో వైరాగ్యం ఒలికేలా మాట్లాడారు గడ్కరి. దీంతో పార్టీలో ఆయన ఎగ్జిట్ కు ఆయనే బాటలు వేసుకున్నట్లైంది. అత్యంత కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం కోల్పోయారు. ఇది ఆయనలో అసంతృప్తిని మరింత పెంచింది.
ఈ నేపథ్యంలోనే గడ్కరీ పార్టీ మారుతారంటూ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. దీంతో గడ్కరీ ఆ ప్రచారానికి తెర దించాలని భావించారు. అందుకే తాను పార్టీ మారే ప్రశక్తే లేదనీ, బీజేపీలోనే కొనసాగుతాననీ స్పష్టం చేశారు. అయినా తాను పార్టీ మారడమేమిటి? మారితే అది కూడా కాంగ్రెస్ లో చేరడమేమిటని ఆశ్చర్యపోయారు. చావనైనా చస్తా కానీ కాంగ్రెస్ లో మాత్రం చేరనని కుండబద్దలు కొట్టేశారు. అయినా ఇప్పుడేమిటి.. దివంగత కాంగ్రెస్ నేత, తనకు స్నేహితుడు అయిన శ్రీకాంత్ జిచ్కార్ చాలా కాలం కిందటే తనను కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించారని గడ్కరీ చెప్పారు. అప్పుడే ఆయనకు బావిలో దూకి చస్తాను కానీ కాంగ్రెస్ గూటికి మాత్రం చేరనని ఆయనకు స్పష్టం చేశానని గడ్కరీ వివరించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తనకు నచ్చవన్నారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి, ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.