చీమలు చంపేస్తున్నాయి!
posted on Aug 30, 2022 @ 10:22AM
శివుడాజ్ణ లేకుండా చీమ కుట్టదంటారు. అలా కుడితే కుట్టీ కట్టంగానే చస్తుందని కూడా చెబుతారు. కానీ ఎల్లో క్రేజీ యాంట్స్ మాత్రం శివుడాజ్ణ తీసుకుని మరీ దండెత్తుతున్నాయా అన్న రేంజ్ లో భయందోళనలకు కారణమౌతున్నాయి. తమిళనాడులోని కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోని ఓ ఏడు గ్రామాలను చీమలు హడలెత్తిస్తున్నాయి.
ఈ చీమలను ఎల్లో క్రేజీ యాంట్స్ అంటారు. ఇవి అటవీ ప్రాంత సమీపగ్రామాలను బెంబేలెత్తించడమే కాదు.. ఆ గ్రామాల ప్రజల జీవనోపాధిపైనా దాడి చేస్తున్నాయి. ఈ గ్రామాల ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం, పశువుల పెంపకం. అయితే చీమల దాడి ఆ జీవనోపాధినే దెబ్బతీసేంత తీవ్రంగా ఉంది. మనుషులను అవి కుట్టవు కానీ పాకితే చాలు ఒంటిపై పొక్కులు వస్తున్నాయి. చీమలు దండుగా వస్తుండటంతో తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.
వీటి కారణంగా చాలా మంది ఊళ్లు వదిలేసి వేరే ప్రాంతాలకు వలస వెడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇవి చిన్నచిన్న కీటకాలను, పురుగులను చంపేస్తుంటాయి. స్థానిక జాతుల కీటకాలు, చీమల పుట్టల్ని ఆక్రమించి వాటిని నాశనం చేస్తుంటాయి. ఒకటని కాదు ఏది దొరికితే దానిని తినేస్తాయి.సమస్యలు ఇక్కడితో తీరడం లేదు. చీమల వల్ల కుందేళ్ల సంతతి గణనీయంగా తగ్గిపోయింది. ఈ చీమలు కుట్టకపోయినా అవి విడుదల చేసే ఒక రకమైన రసాయనం (యాసిడ్) వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పశువులకు ప్రాణహాని కలుగుతోంది. అవి విడుదల చేసే యాసిడ్ కారణంగా చర్మం పొట్టురాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ చీమల బెడదను అరికట్టేందుకు కీటక సైంటిస్టులు, అటవీశాఖ అధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు. గతంలో ఆస్ట్రేలియాలోని ఒక ఐలెండ్ లో ఎర్రచీమల బెడద తీవ్రమైన సందర్భంగా హెలికాప్టర్ ద్వారా మందులను పిచికారీ చేసి సత్ఫలితాలను సాధించారు. ఇప్పుడు ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేయనున్నారు.