Read more!

పిల్లలతో తల్లిదండ్రుల సంభాషణ ఎందుకంత ముఖ్యం.

నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. పిల్లల గురించి ఎవరైనా ఏదైనా వాక్యం చెప్పమంటే మొదట ఇదే చెబుతారు. ఆ తరువాత పిల్లల్లో దేవుడుంటాడని కూడా చెబుతారు. పిల్లలు పుట్టినప్పుడు చాలా అపురూపంగా చూసుకుంటాం. ఏడుస్తుంటే ఆకలేస్తుందేమో అని కంగారు పడతాం.  స్థోమతను బట్టి మంచి మంచి బట్టలు వేసి వారిని చూసి మురిసిపోతాం. బొమ్మలు కొనివ్వడం నుండి అడిగిన దానికల్లా తల ఊపుతాం. వారిని అంత ప్రేమగా పెంచి.. మూడు నాలుగేళ్లు నిండగానే ఇక వారి గురించి అంతగా పట్టించుకోవడం మానేస్తాం. చాలా మంది ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకు అన్నీ ఇస్తున్నాం, అన్నీ సమకూరుస్తున్నాం, లోటు చేయడం లేదు కదా అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పని, వారికి అడిగిందల్లా ఇవ్వడం కాదు ప్రేమను పంచాలని, పసి మనసుల్లో బరువు దించాలని, వారితో మాట్లాడాలని పిల్లల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు.

పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధం ఎలా ఉండాలి?

 పిల్లలకు కావాల్సిందేమిటి? పిల్లలతో సంభాషణ ఎందుకంత ముఖ్యం?  వంటి  విషయాల గురించి చర్చించేందుకు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధాన్ని దృఢంగా మార్చేందుకు ప్రతి ఏడాది డిసెంబర్ 5 వ తేదీన పిల్లలతో సంభాషణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని ప్రకారం పిల్లలతో తల్లిదండ్రులకు ఉండాల్సిన అనుబంధం గురించి మరింత అవగాహన కల్పిస్తారు. బిజీ జీవితాలు గడిపే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా చేతులారా వైఫల్యాలకు గురిచేస్తారో వారికర్థమయ్యేలా చెప్పడం, పిల్లల విషయంలో వారు ఎలా ఉండాలో తెలియజేయడం, వారి మనసు పొరల్లో ఉన్న సందేహాలు, భయాలు, అపోహలను నివృత్తి చేయడం ఈరోజు ఉద్దేశం.

పిల్లలతో ఎందుకు మాట్లాడాలి?

తల్లిదండ్రులు పిల్లలను గొప్పగా పెంచాలని అనుకుంటారు. అందుకోసమే బోలెడంత డబ్బు ఖర్చు చేస్తారు. నిజానికి పిల్లలకోసం డబ్బు ఖర్చు చేయడం కాదు, వారితో మాట్లాడితే పిల్లలు జీవితంలో విజయం సాధిస్తారు. ఉత్తమ పౌరులుగా  మారుతారు. ఎందుకంటే సంభాషణలోనే వారి భవిష్యత్తు నిర్మాణమవుతుంది. పిల్లలతో మాట్లాడే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనుబంధం చాలా దగ్గరగా, స్నేహభావంతో ఉంటుంది. పిల్లలు కొన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడతారు. కొన్ని చెబితే ఏమనుకుంటారో అని సందేహంతో ఉంటారు. కొన్ని విషయాలు అడిగితే తల్లిదండ్రులు కోపం చేసుకుంటారేమో అని చెప్పలేరు.

తల్లిదండ్రులు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం. వాళ్లు రక్తం పంచుకుపుట్టిన పిల్లలు. వారికంటే బయటి ప్రపంచం, డబ్బు, విలాసాలు ఏవీ ముఖ్యం కాదు.  అందుకే వారితో మాట్లాడుతుంటే తల్లిదండ్రులే తమకు గొప్ప స్నేహితులు అని భావిస్తారు.

పిల్లలతో ఏం మాట్లాడాలి?

పిల్లలతో ఏం మాట్లాడాలనే డైలమా చాలామంది తల్లిదండ్రులలో ఉంటుంది. అయితే పిల్లతో మాట్లాడటానికి వారిలో పరిణితి పెంచడానికి, వారిని ఆలోచించేలా చెయ్యడానికి చాలా అంశాలున్నాయి.

పిల్లలు ఇంట్లో,  స్కూల్ నుండి రాగానే, స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు. చాలా  సందర్బాలలో బోలెడు అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు.

పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారు ఏ విషయాల మీద ఎక్కువ ఆసక్తిగా ఉన్నారో గమనించాలి. వాటి గురించి పిల్లలతో మాట్లాడాలి. అందులో తప్పొప్పులు వారితో చర్చించాలి. దీనివల్ల పిల్లలో ఆలోచనా సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

 చాలామంది తల్లిదండ్రులు  పిల్లలు స్కల్ నుండి పిల్లలు ఇంటికి రాగానే.. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని అడుగుతారు. పిల్లలు కూడా చాలావరకు అల్లరి చేయడం స్కూల్లో పనిష్మెంట్ కు గురికావడం జరుగుతూ ఉంటుంది. ఈ  విషయం చెప్పేటప్పుడు పిల్లలు నిరాశగా, బాధగా ఉంటారు. అదే ఈ ప్రశ్న కాకుండా వేరే ప్రశ్నలు అడిగితే పిల్లలు సంతోషిస్తారు. ఎంతో ఉత్సాహాంతో తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఈరోజు స్కూల్లో ఏ పని బాగా చేశావనో..  క్లాసులో జరిగిన సరదా సంఘటన ఏంటనో.. అడగాలి. ఇవే కాకుండా.. ఏ సబ్జెక్ట్ కష్టంగా అనిపించిందని, మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఎలా ఉందని కూడా అడగచ్చు. వీటి వల్ల పిల్లలు సంతోషంగా సమాధానాలు ఇస్తారు. పిల్లలను నొప్పించిన సంఘటనలు ఏవైనా ఉన్నా నోరువిప్పి చెబుతారు.  దానివల్ల పిల్లలకు ఏ విషయాన్ని దాపరికం లేకుండా చెప్పడం అలవాటు  అవుతుంది.

స్నేహితుల గురించి, స్నేహితులతో జరిగే సంఘటనల గురించి వారితో సాన్నిత్యం, గొడవలు మొదలైనవన్నీ అడగాలి. ఎవరు బాగా స్నేహంగా ఉంటారో, వారు ఎలా చదువుతారో, వారు ఎలాంటి వారో అడిగి తెలుసుకుంటూ ఉంటే స్నేహం వల్ల పిల్లలు తప్పు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడవచ్చు.

పిల్లలు తప్పు చేస్తే ఎప్పుడూ దండించకూడదు. వాటికి తగిన ఉదాహరణలు చెబుతూ వారు చేస్తున్న తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వివరించాలి. అంతే..  పిల్లలు ఆ తరువాత ఎప్పుడూ తప్పు చెయ్యలేరు. దగ్గర కూర్చుని చెప్పే మాటలు మనసును తాకుతాయి. అదే కోపంగా చెప్పేమాటలు వారి అహాన్ని దెబ్బ కొడతాయి. అందుకే కోపంతో ఎప్పుడూ ఏదీ చెప్పకూడదు. అది భయాన్ని పెంచుతుందే కానీ వారి మనసును మార్చదు.

                                         *నిశ్శబ్ద.