Read more!

సెల్ఫ్ లవ్ ఎందుకు ముఖ్యం?

 

సెల్ఫ్ లవ్ అంటే తమను తాము ప్రేమించుకోవడం. ప్రేమ అనేది ప్రతీ మనిషికి అవసరం. చాలామంది ఇంట్లో వారు, స్నేహితులు, తెలిసిన వారు ఇలా అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇలా ఎంత చేసినా వారిలో ఏదో అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. దీనికి కారణం సెల్ప్ లవ్ లేకపోవడమే. తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తి ఇతరుల అవసరాలు తీర్చి వారిని సంతోష పెట్టగడేమో కానీ వారి దృష్టిలో ఖచ్చితంగా చులకన భావానికి లోనవుతాడు. దీనిక్కారణం తనకంటూ ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చుకోకపోవడమే. అసలు  జీవితంలో సెల్ఫ్ లవ్ ప్రాముఖ్యత ఏంటి? సెల్ఫ్ లవ్ వైపు ఎలా వెళ్లాలి?

సెల్ఫ్ లవ్ ప్రతి వ్యక్తికి ముఖ్యం. ఇదే వ్యక్తికి గుర్తింపునిస్తుంది.  ఇతరులు గౌరవించేలా చేస్తుంది. నిజానికి సెల్ఫ్ లవ్ కలిగిన వ్యక్తులు ఇతరులకు ప్రేమను అందించగలుగుతారు. ఇతరుల నుండి ప్రేమను, గౌరవాన్ని పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తారనే విషయాన్ని అస్సలు  అంగీకరించలేరు. నన్నెవరు ప్రేమిస్తారు? నన్నెవరు గౌరవిస్తారు?  అని తమను తాము చిన్నతనం చేసుకుంటారు.

తమను తాము ప్రేమించుకునే వ్యక్తులు ఎప్పుడూ సంబంధాల విషయంలో నిజాయితీగా ఉండగలుగుతారు. ప్రేమ విలువను గుర్తించగలుగుతారు.  ఇతరులతో ప్రేమగా మాట్లాడగలుగుతారు. ఇవి  ప్రతి మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి.

తమను తాము ప్రేమించుకోవడం ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలకు పునాది వేస్తుంది.  ఎందుకంటేఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, సెల్ఫ్ లవ్ మొదలైనవి ఒకదానితో ఒకటి ముడి పడి ఉంటాయి. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకుంటే ఇతరులతో బంధాలకు విలువ ఇవ్వడంలోనూ, ఇతరులను అర్థం చేసుకోవడంలోనూ ఎలాంటి పొరపాట్లు చేయరు. దీనివల్ల బంధాలు దృఢంగా ఉంటాయి.

సెల్ఫ్ లవ్ అనేది తన గురించి తాను కేర్ తీసుకోవడంలోభాగం. ఇతరులేమన్నారు, ఇతరులు ఏమంటున్నారు? ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతూ ఉంటే  వ్యక్తి ఒత్తిడికి లోనవుతారు. అదే తమను తాము ప్రేమించుకుంటే స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. తమకు మంచి ఏది? చెడు ఏది? అనే విషయాలను గుర్తించి మంచిని తీసుకుని చెడును వదిలి ముందుకు సాగుతారు.

అన్నింటికంటే ముఖ్యంగా స్వీయ ప్రేమ కలిగినవారు నిజాయితీగా ఉంటారు. ఇతరులతో కూడా అంతే నిజాయితీగా ఉండగలుగుతారు.  ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నిజాయితీని పాటిస్తారు.  ఇది లేకపోతే వ్యక్తులలో నటన, అబద్దాలు ఆడటం, బ్యాలెన్సింగ్ లేకపోవడం జరుగుతుంది.

                                            *నిశ్శబ్ద.