ఇంకా పాదయాత్రలు, గర్జనలు ఎందుకు?.. హైకోర్టు వ్యాఖ్య
posted on Nov 3, 2022 @ 9:44AM
అమరావతే ఏపీ రాజధాని అని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విస్పష్టంగా తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఇంకా పాదయాత్రలు, గర్జనలు ఎందుకని హైకోర్టు వ్యాఖ్యానించింది. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొనేందుకు తమకు కూడా అనుమతి ఇవ్వాలని కోరుతూ రైతాంగ సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
అమరావతి రాజధాని కావాలంటూ రైతులు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారని, కర్నూలులో హైకోర్టు కావాలని అక్కడ వాళ్లు చేస్తున్నారని, విశాఖలోనూ గర్జనలు చేస్తున్నారని.. తీర్పు తరువాత కూడా ఇవన్నీ ఎందకు జరుగుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది.
రాజధాని అమరావతేనని తీర్పు ఇచ్చిన తరువాత కూడా ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా మంత్రులతో ప్రకటనలు చేయిస్తూ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందని, కర్నూలులో ర్యాలీలను ప్రోత్సహిస్తోందని పిటిషనర్ తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత, మూడు రాజధానులకు అనుకూలంగా, మరోవైపు అమరావతికి అనుకూలంగా యాత్రలు, గర్జనలు సరికాదని వ్యాఖ్యానించింది.
అంతే కాకుండా దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ను పరిశీలించాలని నిర్ణయించింది. మరో వైపు అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలుచెబుతున్నాయి. రైతులు షరతులు ఉల్లంఘిస్తున్నందునే పాదయాత్ర అనుమతి రద్దు చేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరిందని.. ఆ పిటిషన్ లో డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.