జనసేనాని పవన్ హత్యకు కుట్ర.. నివాసం వద్ద రెక్కీ?
posted on Nov 3, 2022 7:22AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా? ఇందు కోసం ఆయన నివాసం వద్ద రెక్కీ జరిగిందా అంటే ఔననే అంటున్నారు ఆయన రక్షణ సిబ్బంది. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖపట్నంలో పవన్ పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద మంత్రుల వాహనాలపై దాడి సంఘటన అనంతరం పవన్ పై హత్యకు కుట్ర పన్నారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఘటన తరువాత జపనసేన కార్యాలయం వద్ద కూడా అనుమానాస్పద వ్యక్తులు సంచరించారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
తాజాగా పవన్ నివాసం వద్ద కొందరు యువకులు సోమవారం అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించారనీ, ప్రశ్నించిన రక్షణ సిబ్బందిని దూషించి గొడవపడ్డారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసినట్లు చెప్పారు. పవన్ రాకపోకలను గమనిస్తూ కారు, బైక్ లపై ఫాలో అవుతున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పవన్ కల్యాణ్ నివాసం వద్ద బందోబస్తును పోలీసులు పటిష్ఠం చేశారు.