రాహుల్ భారత్ జోడో యాత్రను మసకబార్చడానికేనా?
posted on Oct 29, 2022 @ 4:04PM
ఎవరు ఔనన్నా కాదన్నా రాహుల్ భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సహా ఇప్పటి దాకా రాహుల్ పాదయాత్ర సాగిన అన్ని రాష్ట్రాలలోనూ మంచి స్పందన లభించింది. మీడియా కూడా రాహుల్ పాదయాత్రకు మంచి కవరేజే ఇచ్చింది. కానీ ఆయన పాదయాత్ర తెలంగాణలో అడుగు పెట్టే సరికి సీన్ మారిపోయింది.
రాహుల్ పదయాత్రకు జనస్పందన ఎలా ఉంది అన్న విషయం కూడా తెలియనంతగా మీడియా ఆయన యాత్రను డౌన్ ప్లే చేస్తోంది. అయితే ఇది ఉద్దేశ పూర్వకంగా కాదని పరిశీలకులు అంటున్నారు. ఆయన పాదయాత్ర తెలంగాణలో అడుగు పెట్టిన సందర్భంగా జనస్పందన, యాత్ర వివరాలకు మీడియా , సామాజిక మీడియాలో మంచి కవరేజ్ వచ్చింది. దీపావళి సందర్భంగా విరామం ఇచ్చి తరువాత తెలంగాణలో ఆయన పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ అది ఎవరికీ పట్టని వ్యవహారంగా మారిపోయింది.
మొత్తం మీడియా, సోషల్ మీడియా అంతా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఎపిసోడ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ హడావుడిలో మునుగోడు ప్రచార సంరంభం కూడా మసకబారిపోయింది. అది పక్కన పెడితే రాజకీయ వర్గాలలో మాత్రం రాహుల్ పాదయాత్ర ప్రాముఖ్యతను తగ్గించడానికే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల డ్రామాకు తెరలేచిందా అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ ముక్త భారత్ అన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి బీజేపీకి ఇప్పుడు ప్రధానంగా అడ్డుపడుతున్నది రాహుల్ భారత్ జోడో యాత్రే. ఆయన యాత్రకు వస్తున్న ఆదరణ బీజేపీ టాప్ బ్రాస్ లో బెదురు పుట్టించిందనడంలో సందేహం లేదు.
అందుకే మోడీయే స్వయంగా కాంగ్రెస్ కదులుతోంది జాగ్రత్త అంటూ బీజేపీ క్యాడర్ ను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకోవద్దనీ, ఆ పార్టీ కొత్త పంథాలో, కొత్త వ్యూహాలతో చురుగ్గా పుంజుకుంటోందనీ హెచ్చరించారు. ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి ఆయన అలా అన్నారనే అనుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రవేశించిన తరువాత అప్పటి వరకూ ఆ యాత్రకు వచ్చిన కవరేజ్ హఠాత్తుగా ఆగిపోయింది. అందుకు కారణంగా బయటకు కనబడుతున్నది ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఉదంతం.
ఈ విషయంలోనే రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ లు కూడబలుక్కునే ఈ వ్యవహారానికి తెరలేపారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయంలో బీజేపీ, తెరాసలు కూడబలుక్కున్నాయా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. తమ సందేహాలకు కారణంగా వారు బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్ అయితే.. కేసీఆర్ అవసరం లిక్కర్ స్కామ్ నుంచి తన బిడ్డను కాపాడుకోవడం అని అంటున్నారు. అందుకే ఉభయతారకంగా మునుగోడు ఉప పోరులో పోటీ విషయాన్ని విస్మరించి.. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు, రాహుల్ పాదయాత్ర ప్రభావం లేకుండా చూసేందుకు కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని తెరమీదకు తీసుకువచ్చారని అంటున్నారు.