మునుగోడులో బీసీ ఓట్లే కీలకం.. మొగ్గు ఎటు?
posted on Oct 29, 2022 @ 3:11PM
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ నియోజకవర్గాన్ని 84 యూనిట్లుగా చేసి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లను ఆయా యూనిట్లలో మోహరించింది. అలాగే బీజేపీ కూడా ఇక్కడ విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లోకి సైతం వెళ్లి ప్రచారం చేస్తూ బీజేపీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం.. తన ఐదో విడత మహా సంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేసి మరీ మునుగోడు ప్రచారంలో నిమగ్నమయ్యారు.
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యం అన్నట్లుగా కదన రంగంలోకి దూకింది. టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి.. మునుగోడులోనే బస చేసి మరీ.. పార్టీ విజయం కోసం సర్వశక్తుల ఒడ్డుతున్నారు. అందుకే రాహుల్ పాదయాత్రలో రేవంత్‌రెడ్డి ఇలా పాల్గొని.. అలా మళ్లీ మునుగోడుకు వచ్చేసి.. తన ప్రచారాన్నికొనసాగిస్తున్నారు.
అయితే దుబ్బాక, హూజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్ఎస్.. మునుగోడులో ఎలాగైనా గెలిచి తీరాలన్న ధ్యేయంతో ప్రచారాన్ని మరో లెవల్ కు తీసుకువెడుతోంది. అలాగే బీజేపీ కూడా దుబ్బాక, హుజూరాబాద్‌లలో గెలిచాం.. ఆలాగే మునుగోడులో కూడా గెలిచి కమలం సత్తాను సీఎం కేసీఆర్‌కు మరోసారి రుచిచూపించాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు అనుగుణంగానే ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది.
మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారిలో 90 వేలకుపైగా బీసీలే. మునుగోడు లో ఎవరు విజయం సాధించాలన్న బీసీ ఓట్లే అత్యంత కీలకం. ఈ విషయమే మూడు పార్టీలలోనూ టెన్షన్ కు కారణమౌతోంది. ఎందుకంటే మునుగోడు బరిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ముగ్గురూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే.
అలాంటి వేళ.. బీసీ ఓట్లు కోసం ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేయడమే కాదు.. బీసీలను తమ వైపు తిప్పుకుంటే.. తమ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అని భావిస్తున్నాయి. మరి బీసీలు ఎవరి వైపు.. ఏ పార్టీ వైపు.. ఎవరి పక్షాన నిలబడారనేది తెలియాలంటే మాత్రం నవంబర్ 6వ తేదీ వరకు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.