ఢిల్లీలో అల్లుడు మిస్సింగ్.. హరీష్‌ను మళ్లీ సైడ్ చేసేశారా?
posted on Sep 2, 2021 @ 3:34PM
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శ్రీకారం పడింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఇకపై హస్తినలో తెలంగాణ వాణి మరింత గట్టిగా వినిపించేందుకు ఈ తెలంగాణ భవన్ వేదిక కానుంది. అందుకే అంత కీలకపాత్ర పోషించనున్న పార్టీ కార్యాలయం శంకుస్థాపనను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు రోజులు ముందుగానే మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లి ఏర్పాట్లును పర్యవేక్షించారు. ముహూర్తం వేళకు ముఖ్యమంత్రితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గసభ్యులు భారీగా హాజరై భూమిపూజను విజయవంతం చేశారు. అయితే.. చిన్నలోటు. ఆ ఫ్రేమ్‌లో ఎంతమంది ఉన్నా.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కీలక నేత కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ అల్లుడు, మంత్రివర్గ సహచరుడు, పార్టీలో ప్రధాన నాయకుడైన.. తన్నీరు హరీష్‌రావు.. ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపనకు హాజరుకాకపోవడం కలకలం రేపుతోంది.
హస్తిన పర్యటనకు హరీష్‌రావు డుమ్మా కొట్టారా? లేక, మామే అల్లుడిని పక్కన పెట్టేశారా? అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఢిల్లీలో పార్టీ బిల్డింగ్‌కు శంకుస్థాపన జరిగే కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావును కావాలనే సీఎం కేసీఆర్ తీసుకెళ్లలేదని అంటున్నారు. ఢిల్లీకి ఎంపీ సంతోష్ రావును తనతో పాటు విమానంలో తీసుకెళ్లిన కేసీఆర్... హరీష్ రావును ఎందుకు తీసుకెళ్లలేదన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు.. ఈ రెండు హరీశ్‌రావు విషయంలో నిజమనిపిస్తుందని, సంతోష్ రావుకు ఇచ్చిన విలువ హరీష్ రావుకు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
అంతేకాదు సెప్టెంబర్ 2న జెండా పండగను తెలంగాణవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది టీఆర్ఎస్. వాడ వాడలా పార్టీ జెండాలు ఎగురవేశారు. అయితే ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ భూమి పూజకు హాజరు కాని హరీష్ రావుకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లోనూ జెండా ఎగరేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ భవన్ లో ఓ మామూలు నాయకుడే జెండా ఎగురవేశారు. హరీశ్ రావు మాత్రం సిద్ధిపేటలో పార్టీ జెండా ఎగరేసి ఇంటికే పరిమితమయ్యారు. గులాబీ అగ్ర నాయకత్వమంతా ఢిల్లీలో పండగ చేసుకుంటుంటే.. హరీశ్‌రావు మాత్రం ఓ మూలకు పరిమితమై.. తనకు ఇంతే ప్రాప్తమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
హరీశ్‌రావు.. ఉద్యమం నాటి నుంచి కేసీఆర్‌కు తోడునీడగా ఉన్న నాయకుడు. కేటీఆర్ ఎంట్రీతో హరీశ్‌రావు ప్లేస్ ప్రమాదంలో పడింది. ఇక సంతోష్‌కుమార్ రాకతో ఏకంగా ఆయన ఉనికే ప్రశ్నార్థకమైంది. అప్పటి వరకు కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటోడు అనే ఇమేజ్ ఉన్న హరీశ్‌రావును.. అంతలోనే అడ్రస్ లేకుండా చేసేశారు. పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉండే అల్లుడిని.. కొడుకు కోసం అథఃపాతాళానికి కేసీఆరే తొక్కేశారని అంటారు. అప్పటి నుంచి.. హరీశ్ పొలిటికల్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. హరీశ్‌రావు పేరే వినిపించకుండా అందరినీ కట్టడి చేశారు. హరీశ్‌రావు ఉనికే లేకుండా అంతటా కట్టుదిట్టం చేశారు. గత టర్మ్‌లో కీలకమైన నీటిపారుదల శాఖను హరీశ్‌రావుకు కట్టబెట్టిన కేసీఆర్.. ఈ సారి తొలుత కొన్ని నెలల వరకు ఆయనకు ఏ పదవీ ఇవ్వకుండా చుక్కలు చూపించారు. ఆ తర్వాత.. ఆర్థిక శాఖను కట్టబెట్టి.. ఎలాంటి పవర్ లేకుండా కోరలు పీకేశారు. కట్ చేస్తే.. ఈటల రాజేందర్ తిరుగుబాటుతో గోడకు కొట్టిన బంతిలా.. మళ్లీ సడెన్‌గా కీలక నేతగా అవతరించారు హరీశ్‌రావు. మామ దయతలచడంతో.. మళ్లీ చక్రం తిప్పడం స్టార్ట్ చేశారు అల్లుడు.
హుజురాబాద్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న హరీష్ రావు తెలంగాణ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకపోవడంపై టీఆర్ఎస్ కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. హరీష్ రావును కేసీఆర్ కావాలనే పక్కన పెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ లో గెలవలేమని తెలుసు కాబట్టే హరీష్ కు బాధ్యతలు అప్పగించారని, ఎన్నిక తర్వాత ఆయనను బలి పశువును చేయాలని చూస్తున్నారనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గెలిచే అవకాశాలున్న చోట కేటీఆర్ ను ఇంచార్జ్ గా పెడుతూ.. ఓడిపోయే చోట హరీష్ ను తిప్పుతూ కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ వాదులు చెబుతున్నారు. మొత్తానికి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లకపోవడంతో టీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.