వెంకటరెడ్డిపై చర్యలకు ఉపేక్ష ఎందుకు.. కాంగ్రెస్ అంత బలహీనమా?
posted on Aug 23, 2022 @ 11:53AM
మునుగోడు ఉప ఎన్నిక ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యే. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ కే ఎక్కువ కీలకం, ఎక్కువ అవసరం. ఎందుకంటే మునుగోడులో ఫలితం కాంగ్రెస్ కు ప్రతికూలంగా వస్తే... ఇంత కాలంగా శ్రేణులలో పెరుగుతూ వస్తున్న ఉత్సాహం నీరుగారిపోతుంది. ఆ ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది. అంతటి కీలక ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ తన బలహీనతను వదులుకోవడంలో ఆమోదయోగ్యం కాని తాత్సారం ప్రదర్శిస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అధిష్ఠానం నిర్ణయం తీసుకోకుండా చేస్తున్న తాత్సారం వెరసి మునుగోడుపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన పార్టీ క్యాడర్ లో వ్యక్తమౌతోంది. వెంకటరెడ్డి సోదరులను ఇంత కాలం ఉపేక్షించడమే కాంగ్రెస్ చేసిన తప్పు అని, ఇప్పుడు కూడా వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోకపోతే మునుగోడుపై ఆశలు వదిలేసుకోవడమే మంచిదని క్యాడరే అంటున్నదంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ లో వ్యక్తులు కాదు.. పార్టీయే ముఖ్యం అని చెబుతుంటారు. అయినా మునుగోడు విషయానికి వచ్చే సరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధిక్కార స్వరాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు భరిస్తోందన్నది అర్ధం కావడం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు. మునుగోడు కాంగ్రెస్ కు కంచుకోట అనడంలో సందేహం లేదు. అటువంటి కంచుకోటలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ ఎమ్మెల్యే బీజేపీ పంచన చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేస్తున్నారు. అటువంటప్పుడు కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని రంగంలోనికి దింపి క్యాడర్ చెక్కు చెదరకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ ఆ పని చేయడం లేదు. టీపీసీసీ చీఫ్ కోమటిరెడ్డి సోదరుల విమర్శలను గట్టిగా తిప్పి కొట్టేందుకు అధిష్ఠానం వైపు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అదే సమయంలో సోదరుడు పార్టీ వీడిన విషయాన్ని పక్కన పెట్టి టీపీసీసీ చీఫ్ పై విమర్శల వర్షం కురిపిస్తూ పార్టీకి నష్టం చేకూరుస్తున్న వెంకటరెడ్డిపై హై కమాండ్ చూసీ చూడనట్లు వదిలేసే వైఖరి అవలంబిస్తోంది. ఇదే అలుసుగా తీసుకుని వెంకటరెడ్డి రెచ్చిపోతున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి పదవులు ఎలా ఇస్తారని అధిష్ఠానాన్నే నిలదీస్తూ టీపీసీసీ చీఫ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనతో కలిసి పని చేసే ప్రశక్తే లేదని ఖరాకండీగా చెప్పేశారు. మునుగోడుతో తనకు సంబంధం లేదనీ, అక్కడ ప్రచారానికి వెళ్లననీ తెగేసి చెప్పేశారు. అంతటితో ఆగకుండా పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జిపై ఆరోపనలు గుప్పించారు. ఆయనను తెలంగాణ నుంచి పంపేయాలనీ.. కమల్ నాథ్ నో.. లేదా అటువంటి మరో వ్యక్తినో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు.
ఆయన ఇంతలా రెచ్చిపోతున్నా.. పార్టీ రాష్ట్ర చీఫ్ మాత్రం మేం కలిసే పని చేస్తామనీ, వెంకటరెడ్డి మునుగోడులో ప్రచారం చేస్తారనీ చెప్పుకుంటున్నారంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకుండా మునుగోడులో పార్టీ ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. కఠిన నిర్ణయాలకు వెరిస్తే పార్టీ మునుగోడులోనే కాకుండా ఆ తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పార్టీ క్యాడర్ ఆందోళనలో ఉంది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ మారినా.. కాంగ్రెస్ క్యాడర్ ఆయన ఆశించిన విధంగా రాజగోపాలరెడ్డి వెంట నడవలేదు. కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉంది. కొద్ది మంది అనుచరులు వినా ఎవరూ కమలం గూటికి చేరలేదు. ఏకంగా అమిత్ షా సభ పెట్టినా కూడా కాంగ్రెస్ నుంచి పెద్దగా వలసలు లేవు.
అటువంటప్పుడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి ఉప ఎన్నికకు క్యాడర్ ను కార్యోన్ముఖులను చేసేందుకు ఉపక్రమించాల్సిన కాంగ్రెస్ ఆయన సోదరుడి నోటికి కళ్లెం వేయడానికి కూడా జంకే పరిస్థితిలో ఉండటమేమిటని పరిశీలకులు అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరాజయమే లక్ష్యమన్నట్లుగా తోస్తున్నదని.. పార్టీలో ఉంటూనే శల్యుడిలా పార్టీ పురోగమనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇప్పటికైనా ఆయన విమర్శలకుకళ్లెం వేసి.. మునుగోడులో ప్రచారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరిశీలకులే కాదు.. పార్టీ కేడర్ సైతం అభిప్రాయపడుతోంది. ప్రియాంకా గాంధీతో జరిగినసమావేశానికి కోమటిరెడ్డి గైర్హాజర్ కావడమే కాదు.. రేవంత్‌పై ఆరోపణలు చేశారు. సోనియాకు లేఖ రాశానంటూ దాన్ని మీడియాకు విడుదల చేశారు.
ఎయిర్ పోర్టుకే మీడియాను పిలిపించి మునుగోడుపై ప్రియాంకా గాంధీ మీటింగ్ కంటే ఎక్కువ హంగామా చేశారు. అయినా రేవంత్ రెడ్డి కానీ సీనియర్లు కానీ.. ఆయన సమయాభావం వల్ల రాలేకపోయారని సమర్ధించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు ఆయన కాంగ్రెస్ లో ఉంటూ.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి సోదరుడు రాజగోపాలరెడ్డి విజయానికి మార్గం సుగమం చేసేలా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డిని ఇంకా బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూండటం ఆ పార్టీ కార్యకర్తల్లోనేఅసహనానికి కారణం అవుతోంది.
రాజగోపాల్ రెడ్డి .. అన్న మాట జవదాటడు. అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహంలో భాగంగానే జరుగుతోందని రాజకీయా పరిశీలకులు అంటున్నారు. సోదరులిరువురూ కలిసి కాంగ్రెస్ కు దెబ్బకొట్టే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తుంటే కాంగ్రెస్ ఇంకా మీనమేషాలు లెక్కించడమే ఆ పార్టీ బలహీనత అంటున్నారు.