కర్నాటక సీఎం పదవి.. ఎవరిని వరించేనో?
posted on May 15, 2023 @ 2:27PM
డీకే శివకుమార్ కర్నాటక కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలు కావడంలోనూ.. అంచనాలకు సైతం అందనంతగా కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలోనూ డీకే శివకుమార్ ది కీలక పాత్ర. కర్నాటక పీసీసీ చీఫ్ కూడా. పార్టీ విజయానికి ప్రధాన కారకుడు, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కాడె మోసి కాంగ్రెస్ రాష్ట్రంలో నిలబడటంలో కీలక భూమిక పోషించిన డీకే శివకుమార్ కు మాత్రం ఆయన పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేసులో ఆయన ముందువరుసలో ఉన్నప్పటికీ ఆ పదవి ఆయనకు దక్కే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
ఇందుకు ఆయనకు ప్రధానంగా అడ్డంకులు సృష్టిస్తున్నది కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని అంటున్నప్పటికీ.. బీజేపీ వ్యూహాత్మకంగా గతంలో ఆయనపై పెట్టిన కేసులు, సీబీఐ దర్యాప్తే కారణమని అంటున్నారు. కర్నాటకలో బీజేపీ ఇలా పరాజయం పాలైందో లేదో.. ఆ పరాజయానికి ప్రధాన కారకుడైన డీకే శివకుమార్ ను ఇరుకున పెట్టే విధంగా బీజేపీ అధిష్ఠానం పావులు కదిపిందంటున్నారు. బీజేపీ ఎత్తుగడలో భాగమే.. సీబీఐ కత్త బాస్ గా ప్రణీత్ సూద్ ను కేంద్రం నియమించింది. కేంద్రం ఈ మూవ్ సిద్దరామయ్యను ఇరుకున పెట్టడానికేనని అంటున్నారు. కర్నాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ ను సీబీఐ చీఫ్ గా నియమించడంతో డీకే శివకుమార్ పై బీజేపీ బనాయించిన అవినీతి కేసుల దర్యాప్తును మళ్లీ తెరపైకి తీసుకురావడం ద్వారా ఆయన సీఎం రేసులో వెనుకబడేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించందని అంటున్నారు. శివకుమార్ ను ఒక వేళ పార్టీ అధిష్ఠానం సీఎంగా ఎంపిక చేసి పదవి కట్టబెట్టినా.. కేసుల కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకునే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్న అనుమానాలున్నాయి. దీంతో కర్నాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్యనే ఎంపిక చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
డీకే కూడా అదే అభిప్రాయంతో హస్తిన వెళ్లకుండా బెంగళూరులోనే ఉండిపోయారనీ, తన అసంతృప్తిని మాత్రం తన మాటల ద్వారా గట్టిగా వ్యక్తం చేస్తున్నారనీ అంటున్నారు. తాను కాంగ్రెస్ కోసం చేయగలిగినంత చేశాననీ, ఎన్నో త్యాగాలు చేశాననీ అంటున్నారు. సిద్దరామయ్యతో విభేదాలున్నాయన్న వార్తలు కేవలం వదంతులేనని స్పష్టం చేసిన డీకే శివకుమార్ గతంలో ఎన్నో మార్లు ఆయనకు మద్దతుగా నిలబడ్డానని గుర్తు చేస్తున్నారు. కర్నాటక సీఎం ఎపింక కసరత్తు జరుగుతున్న తరుణంలో డీకే మాటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేసులు, అరెస్టు ముప్పు పొంచి ఉన్న డీకే శివకుమార్ కు చాన్సెస్ తక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా అదే భావంతో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.
ఈ తరుణంలో రాష్ట్రంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ అభిమానులు, అనుచరులు ఫెక్సీ వార్ కు తెరతీశారు. ఈ నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ అంతర్గత కలహాల కారణంగా ఆ విజయ ఫలాలను చేజార్చుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరోసారి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తున్నది. అయితే రాష్ట్రంలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఇప్పటికే సిద్ధరామయ్యకు ముఖ్యమత్రి పదవి విషయంలో అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చేసిందంటున్నారు.
అందుకే ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని పరిశీలకులు హస్తిన వెళ్లినా, వారి వెంట సిద్దరామయ్య కూడా హస్తిన బాట పట్టినా డీకే శివకుమార్ మాత్రం బెంగళూరు దాట లేదు. తాను చేయాల్సిందంతా చేశాననీ, బీజేపీ కుట్రపూరితంగా తనను జైలు పాలు చేసినప్పుడు సోనియా గాంధీ తనను జైలుకు వచ్చి మరీ పరామర్శించిన సంగతినీ గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ విజయంతో తన పాత్రను అధిష్ఠానం విస్మరించదన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి డీకే, సిద్ధరామయ్యల మధ్య పంచాయతీని కాంగ్రెస్ అధిష్ఠానం ఎటువంటి నష్టం లేకుండా ఎలా పరిష్కరిస్తుందో.