ఫలితాల తర్వాత వామ పక్షాల వైఖరిలో మార్పు
posted on May 15, 2023 @ 2:46PM
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో విపక్షాలు బీజేపీతో పాటు మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇన్నాళ్లు కాంగ్రెస్, బిజెపిలను సమదూరంలో ఉంచిన వామ పక్షాలు ప్రస్తుతం కర్ణాటక ఫలితాల తర్వాత కేవలం బిజెపిని మాత్రమే టార్గెట్ గా ఎంచుకున్నాయి.
పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై కాకుండా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సిపిఐ, సిపిఎంలు యోచిస్తున్నాయి. ఈ క్రమంలో సీపీఐ నారాయణ కర్ణాటక ఎన్నికల్లో మోడీకి అవమానం జరిగిందన్నారు. ఇంతలా దిగజారిన ప్రధానిని చూడలేదన్న ఆయన రానున్న ఎన్నికల్లో మోడీ ఎట్టి పరిస్థితుల్లో రారని వ్యాఖ్యానించారు
మత విద్వేషాలు రెచ్చగొట్టారని, లౌకిక దేశానికి మోడీ ప్రధానిగా అనర్హుడని నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.కర్ణాటక ప్రజలు బీజేపీని చితక్కొడడంతో సౌత్ లో ఆ పార్టీకి గేట్లు మూసుకుపోయాయన్నారు నారాయణ. కర్ణాటక ఫలితాలు దేశానికే దిక్సూచి అని అన్నారు.
ఇక తెలంగాణలో మాకో ఆప్షన్ వచ్చిందని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి సీన్ లేదని.. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే పోటీ అని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కర్ణాటక ఎన్నికల ప్రభావం తప్పని సరిగా తెలంగాణ పై ఉంటుందన్నారు. అయితే కేసీఆర్ జాయింట్ యాక్షన్ లోకి రావడం లేదని.. కొన్ని రోజుల పాటు చూసి ఆ తరువాత మా రూట్ మేము చూసుకుంటామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ పొత్తులపై చర్చ చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.ఇక మాక్కూడా సీట్లు కావాలని, మేమేం రాజకీయ సన్యాసం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీన్ని బట్టి త్వరలోనే కామ్రెడ్లు కాంగ్రెస్ తో దోస్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.