వీకెండ్ విరామం లేదు.. లోకేష్ పాదయాత్ర నిరాటంకం!
posted on May 15, 2023 @ 1:56PM
పాదయాత్ర మొదలు.. మధ్య మధ్యలో విరామం ఇచ్చి.. ప్రతీ గురువారం రాత్రి విమానంలో హైదరాబాద్‌కు వచ్చేసి.. మళ్లీ ఆ మరునాడే అంటే శుక్రవారం సాయంత్రం విమానం ఎక్కి అటు విజయవాడ ఎయిర్‌పోర్టో లేదా రాజమండ్రి ఎయిర్ పోర్టో అదీకాకుంటే కోడి కత్తితో అదృష్టాన్ని తెచ్చి పెట్టిన విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లోనో దిగి పాదయాత్ర ఎక్కడ వరకు ఆపారో.. అక్కడికి చేరుకొని.. మళ్లీ పాదయాత్ర కొన... సాగించడాలు లేవు. అలాగే నేను ఉన్నాను.. నేను విన్నాను లాంటి కాకమ్మ కబుర్లు లేవు... ఇక తెచ్చి పెట్టుకొన్న షిక్కటి చిరునవ్వులు అయితే అసలు లేవు కాక లేవు.. ఉన్నది ఒక్కటే.. దృఢ సంకల్పం.. స్థిర చిత్తం.. వీటినే ఆయుధంగా మలుచుకొని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్విరామంగా ముందుకు దూసుకు పోతోంది. ఓ వేళ ఆయన.... తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చినా, అది నందమూరి తారకరత్న మరణించిన సమయంలో హైదరాబాద్ చేరుకొని.. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి.. మళ్లీ వెంటనే తిరిగి వచ్చి తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు లోకేష్.
అలాగే హైదరాబాద్ మహానగరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించినా... ఏప్రిల్ 28వ తేదీన విజయవాడలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ప్రారంభ వేడుక ఘనంగా జరిగినా నారా లోకేష్ తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చి.. వాటిలో పాల్గొన లేదు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే జగన్ ప్రభుత్వం మేమే నెంబర్ వన్ అంటూ.. జీవో నెంబర్ వన్ తీసుకు వచ్చినా.. అలాగే యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేష్‌కు పోలీసులు పలు రకాల అడ్డంకులు సృష్టించినా.. ఎక్కడ ఆయన పాదం అగిందీ లేదు.. మరెక్కడా ఆయన వెనకడుగు వేసింది లేదు.
అలా జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర విరామం లేకుండా.. ప్రతి రోజూ.. గ్రామాలు, పట్టణాల ప్రజలతో ఆయన మమేకమవుతూ ముందుకు సాగిపోతున్నారు. అలాగే రైతులు, మహిళలు, యువత... ఇలా అందరిని కలుసుకొంటూ.. వారి సమస్యలను అడిగి.. వాటిని సావధానంగా వినడం.. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ స్పష్టమైన భరోసా సైతం కల్పిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు.
అయితే నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మే 15వ తేదీ అంటే సోమవారం వంద రోజుల మైలు రాయిని చేరుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఆయన చేపట్టిన పాదయాత్ర శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొని.. అశేష ప్రజాభిమానంతో దిగ్విజయంగా ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికి రాయలసీమలోని మూడు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర కొనసాగింది. అదీ రాయలసీమ... ఆ పైన ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇలాకా కడప జిల్లాలో సైతం నారా లోకేశ్‌కు ప్రజలు బ్రహ్మరథం సైతం పట్టారు. ఇక ఆయన పాదయాత్ర కోస్తా జిల్లాల.. మీదగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశిస్తే.. ఇక జనం ప్రభంజమే అని పరిశీలకులు అంటున్నారు.
మరోవైపు నారా లోకేశ్ 100వ రోజు మైలురాయిని పూర్తి చేసుకొంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అందులోభాగంగా నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా 175 నియోజవర్గాల్లోని పార్టీ శ్రేణులు పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో మూడు వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్ల మేర పాదయాత్రను నిర్వహించనున్నాయి.
ఇక మే రెండో ఆదివారం మదర్స్ డే ఈ నేపథ్యంలో నారా లోకేష్‌కు ఆయన తల్లి నారా భువనేశ్వరి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 99వ రోజు అంటే మే 14వ తేదీ ఆదివారం తన పాదయాత్ర ముగించుకొని శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేవుల క్యాంప్ వద్దకు ఆయన చేరుకొగానే.. ఎదురుగా తల్లి భువనేశ్వరి కనిపించడంతో నారా లోకేశ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ 100వ రోజు లోకేశ్ పాదయాత్రలో తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఇక భర్త చంద్రబాబు సుదీర్ఘ రాజకీయం జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రానీ నారా భువనేశ్వరి తొలిసారి బిడ్డతో కలిసి అడుగు వేయడం.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యువగళం పేరుతో నారా లోకేశ్ 2023, జనవరి 27న ప్రారంభించిన పాదయాత్ర.. 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది.