తెలంగాణలో వేగంగా పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్.. కేసీఆర్ జాతీయ ఆకాంక్షే దెబ్బ కొట్టిందా?
posted on Jul 7, 2023 @ 1:58PM
ఇక్కడే ఉండి ఏదన్నా చేసుకో నగరానికి వెళ్లి ఏం వెలగబెడతావ్? అంటుంది బామ్మ మనవడి హైదరా బాద్ ఉత్సాహాన్ని చల్లబరుస్తూ. చిన్నోచితకో ఉన్నవూళ్లో చేసుకుంటే బాగుంటుందేగాని ఎవరూ తెలీని నగరానికెళ్లి ఉద్ధరించేదేవిట్రా పిచ్చి సన్నాసీ! అని ఆమె హెచ్చరిక. అధినేత కేసీఆర్ కేంద్రంలో పాగా వేసే ప్రయత్నం అత్యాస, వృధా ప్రయాసగా మిగిలిందని.. ఇప్పుడు పరిశీలకులు అంటున్నారు.
చిన్నరాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావడం ఒక ఎత్తు. కానీ అదే ధీమాతో నలుగురినీ చేర్చుకుని కేంద్రా నికి గాలం వేయాలనుకోవడమే తొందరపాటు. ఆ తొందరపాటు ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ కాలికి బలపం కట్టుకు తిరిగినా ఎవరి మద్దతూ సంపాదించలేకపోయారు. కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం, ప్రస్థానం వెనుక పదవీ కాంక్షను ఇతర రాష్ట్రాల బీజేపీయేతర పార్టీలు గమనించాయని పరిశీలకులు అప్పట్లో విశ్లేషణలు చేశారు. ఏది ఏమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు చేసిన యత్నాలు సత్ఫలితాలిచ్చాయి. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆయన లెఫ్ట్, రైట్ పార్టీలను కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవడం, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని ఎదిరించడం అన్న ప్రజాస్వామ్య కారణాలతోనే ఎన్టీఆర్ నాడు జాతీయ స్థాయిలో పార్టీల ఐక్యతకు ప్రయత్నించారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నేపథ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రిగా, టీఆర్ ఎస్ అధినేతగా కేసీఆర్ తెలంగాణాలో చక్రం తిప్పారు బాగుంది. కానీ తెలంగాణలలో తనకు లభించిన ఎదురు లేని పరిస్థితి జాతీయ స్థాయిలో కూడా ఉంటుందన్న ధీమాతో టీఆర్ఎస్ ను బీఆర్ ఎస్ గామార్చి భంగపడ్డారు. కనీసం సాటి తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా ఆయన ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. కేసీఆర్ జాతీయ ఆకాంక్షలను తెలంగాణం కూడా హర్షించినట్లు కనిపించడం లేదు. అందుకే తెలంగాణాలోనే కేసీఆర్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత గట్టిగా కనిపిస్తోందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణాల్లో కేసీఆర్ తనయ కవితపై వచ్చిన ఆరోపణలు, విచారణల తరువాత ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ పై కేసీఆర్ విమర్శల దాడి ఆగిపోవడంతో.. కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తడం వెనుక ఏదో స్వార్థ ప్రయోజన కాంక్ష ఉందన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా ఒక జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలంగాణలో బీఆర్ఎస్ తిరోగమనంలో సాగుతోందని తేలింది. నిజం గత రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ కారు ఎంత జోరుగా సాగిందో ఇప్పుడు కూడా అంతే స్పీడుగా రివర్స్ గేరులో పయనిస్తోందని సర్వే ఫలితం చెబుతున్నది. దాదాపు 90 స్థానాలలో ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ అతి కష్టం మీద 30 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని తేలింది. రాజకీయాలతో సంబంధం లేని ఒక జాతీయ సర్వే సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో జరిపిన అధ్యయనం మేరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ వెగంగా పడిపోతోంది. ఆ పార్టీ నమ్మకం పెట్టుకున్న సంక్షేమ పథకాలు కాపాడే అవకాశం లేదని సర్వే పేర్కొంది. ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు ముందు జరిగిన ఈ సర్వే ఒక్కో నియోజకవర్గంలో సగటున 250 శాంపిళ్లను తీసున్నట్లు పేర్కొంది.