మునుగోడులో గెలిచేది ఆ పార్టీ యేనా
posted on Oct 29, 2022 @ 6:27PM
మునుగోడు ఉప ఎన్నిక ను అన్ని పార్టీలు చాలా సీరియస్ గానేతీసుకుంటున్నాయి. ముఖ్యంగా రాబోయే ప్రధాన ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీస్ గా భావించడంతో అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకుంది. మునుగోడును అడ్డుపెట్టుకుని తెలంగాణాలో అధికారం చేపట్టాలన్న పట్టుదలతో బీజెపీ ఉంది. మరో వైపు కాంగ్రెస్ టీపీసిసీ అధ్యక్షుడు రేవంత్ సారధ్యంలో బీజేపీ, టీ ఆర్ ఎస్ లకు చెక్ పెట్టి కేసీ ఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని రెండింతల ఆవేశంతో ముందుకు ఉరుకుతోంది. టీ ఆర్ ఎస్ ఎలాగైనా కాంగ్రెస్ను, బీజేపీ నీ తమ అధికారాన్ని కొల్లగొట్టకుండా చూసే యత్నంలో ఉంది. అయితే తాజా పరిణామాల దృష్ట్యా, టిఆర్ఎస్ కు అంత సీన్లేదని బీజేపీ విజయం సాధించే అవకాశాలే మెండుగా ఉన్నాయని కాంపాక్ట్ సర్వే వెల్లడించింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో జరిగిన అనేక సర్వేలు మాత్రం బీజేపీయే ఈసారి మునుగోడులో గెలుస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఎన్నికలు, ఫలితాలు అత్యంత ఉత్కంఠభరితం గా జరుగుతాయనే చెప్పాలి.
మునుగోడు నియోజకవర్గం లో మొత్తం 2 లక్షల,43వేల,594 ఓట్లున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల అనుసరించి బీజేపీ 36 శాతం, అధికార టీఆర్ఎస్ పార్టీ 41 శాతం ఓట్లు సాధించుకోవచ్చని కాంపాక్ట్ సర్వే తెలియజేసింది. మునుగోడులో కాంగ్రెస్కు 14శాతం, ఇతరులకు 9 శాతం ఓట్లు రావచ్చని తెలుస్తోంది.
మండలాల వారీగా చూసుకుంటే.. చండూరు మున్సిసిపాలిటీలో 9 వేల 950, రూరల్ లో 19 వేల 500 ఓట్లున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీల మధ్య మంచి పోటీ ఉంది. అయితే డబ్బు పంపిణీ జరుగు తున్న నేపథ్యంలో ఓటరు ఎటు మొగ్గు చూపుతాడన్నది అనుమానమే. కాంగ్రెస్ కంటే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్యే పోటాపోటీ నడుస్తోంది. ప్రచారంలో గాని, ఓటర్లను ఆకట్టుకోవడంలోగాని బీజేపీ ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంటోంది. కాగా చౌటుప్పల్ మున్సిపాలిటీ 20 వార్డుల్లో 25 వేల 493 ఓట్లు ఉన్నాయి. చౌటుప్పల్ లో మొదటి రెం డు స్థానాల్లో బీజేపీ, టీఆర్ఎస్ ఓట్లు సమానంగా పంచుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే గతంలో ఇక్కడి కాంగ్రెస్ ఓటు బ్యాంకును రెండు పార్టీలు సమానంగా పంచుకు నేలా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ క్రమేపీ ప్రాభవం కోల్పోయిందనే అనాలి. కానీ భారత్ జోడో యాత్ర ప్రభావం అంతగా లేదనేది స్పష్టమవుతోంది. అయితే పదిరోజుల క్రితం బీజేపీకి చెం దిన ఇద్దరు కౌన్సిలర్లు ఒకరు తంగేడుపల్లి, మరొకరు లింగోజిగూడెంకు చెందిన వారు టీఆర్ఎస్ లో చేరటం గమనార్హం. ఇది బీజేపీపై ప్రభావం చూపవచ్చు. కాగా 16 వేలకు పైగా ఓట్లున్న గట్టుప్పల్ లో బీజేపీ కంటే టీఆర్ఎస్ వెనకంజలో ఉందనే చెప్పాలి. బీజేపీకి 50 శాతం ఓట్లు రావడానికి చాలా అవకాశా లున్నాయి. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు మోహరించినప్పటికీ ఓటరు అధికార పార్టీకే ఓటువేస్తా రనే గ్యారంటీ లేదు. కాంగ్రెస్ విషయానికి వస్తే, ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ ఓట్లు చీలవచ్చు. గతంలో కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న మర్రిగూడలో దాదాపు 28 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ టీఆర్ ఎస్ బలం ఇటీవలి రాజకీయ పరిణామాలతో తగ్గిందనాలి. అధికారపార్టీ ఇక్కడి యువతను ఆకట్టుకోవడానికి విశ్వయత్నాలు చేస్తోంది. ఇక్కడ బీఎస్పీకి కూడా అభిమానులు ఉన్నారు. టీఆర్ ఎస్ ప్రాభవం ఉన్న చాలా గ్రామాల్లో ఓటర్లను డబ్బుతో బాగా ఆకట్టుకుంది. దీనితో ఓటర్లు టీఆర్ఎస్ కు పట్టం కట్టవచ్చు. కానీ డబ్బుల పంపిణీ జరగడం అనేది యింకా అమలు కాలేదు గనుక ఓటర్ మనసు మార్చుకున్నా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు.
ఇక అత్యంత కీలకమైన మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ రెండూ బరాబరీగా ఉన్నాయి. ఇక్కడ 36వేల మంది ఓటర్లలో చాలామంది బీజేపీకే మొగ్గుచూపుతున్నారనాలి. వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ కోటగా భావించినప్పటికీ ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో తలెత్తిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ కొంత ఇబ్బందుల్లో పడిందనాలి. పైగా ఇక్కడ కోమటిరెడ్డి సోదరులకు అభిమానుల బలం ఎక్కువే. మరో వంక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన సోదరుడు వెంకటరెడ్డి పట్ల పార్టీ వర్గాలు కూడా నమ్మకం కోల్పోయాయి. అయితే టీఆర్ ఎస్ ను బలపరిచేందుకు కేసీఆర్ మహాసభ విజయవంతం అయితే పోటీ మరింత పోటాపోటీగా మారుతుంది. అయినప్పటికీ పరిస్థితులు టీఆర్ఎస్ కు అంతగా అనుకూలించవని విశ్లేషకుల మాట. ఇక్కడ అనూహ్యంగా బీజేపీకి మెజారిటీ ఓట్లు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కోమటిరెడ్ది అభిమానులు తప్పకుండా ఈ పరిస్థితుల్లో బీజేపీ నే గెలిపించే అవకాశాలున్నాయని కోపాక్ట్ సర్వే వెల్లడించింది.
కాగా మునుగోడు నియోజకవర్గంలో వెనుకబడినప్రాంతంగా పేర్కొనే నాంపల్లి అభివృద్ధి ఏమాత్రం లేకపోవడంతో ప్రజలు అధికార టీఆర్ ఎస్ పార్టీ పట్ల ఆసక్తి చూపడం లేదు. తండాలు ఎక్కువగా ఉన్న ఈ మండలంలో 35వేల ఓట్లున్నాయి. ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల మాత్రం ప్రజలు విముఖంగా లేరు. అధికార పార్టీ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ కి కూడా వీరాభిమానులు ఉన్నారని సర్వేలో తేలింది. ఇక్కడ త్రిముఖ పోటీకీ అవకాశం ఉందని కోపాక్ట్ సర్వే స్పష్టం చేసింది. కాగా నారాయణపురం విషయానికి వస్తే, ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు మంచి పేరుంది. కాగా టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడివాడే కావడంతో టీఆర్ ఎస్ ప్రతిష్టాత్మకంగానే తీసుకుందనాలి. 36 వేల మందికి పైగా ఓటర్లున్న నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగత అభిమానులు ఉండటంతో ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని. ఇక్కడి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి షిఫ్ట్ అయితే, ఆ పార్టీకి లీడ్ ఉంటుందని కాంపాక్ట్ సర్వే స్పష్టం చేసింది. ఇదే మండలంలోని గుడిమల్కాపూర్ లో వివిధ పథకాలు బాగా అమలు కావడంతో టీఆర్ఎస్ కి కలిసిరావచ్చని పేర్కొన్నది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అదే జరిగితే ఇక్కడ బీజేపీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని సర్వే పేర్కొంది.