అప్పుడలా.. ఇప్పుడిలా..
posted on Oct 29, 2022 @ 5:02PM
నాడు నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆడియో లీక్ చేసి తెలంగాణకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరగబోతోందన్న బిల్డప్ ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పడు కేటీఆర్ బీజేపీ నాయకుడిని టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా కోరుతున్న ఫోన్ సంభాషణ అడియో రిలీజైతే మాత్రం అందులో తప్పేముంది. నేనే మాట్లాడా, అది నా గొంతే అని దబాయించడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. తాను చేస్తే రైటు.. ఇతరులు ఏం చేసినా రాంగ్ అన్న టీఆర్ఎస్ వైఖరికి ఇది నిదర్శనం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పుడు
ఓటుకు నోటు కేసులో అప్పటి ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ తో తెలుగుదేశం అధినేత.. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో మాట్లాడిన మాటల వాయిస్ రికార్డు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఫోన్ కాల్ లో స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడిన మాటలలో సొమ్ము ప్రస్తావన ఏదీ లేదు. అయినా అప్పట్లో చంద్రబాబు మాటలతో తెలంగాణలో ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినంత హడావుడి చేసింది. నాడు ఆ ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు ఎక్కడా డబ్బు ప్రస్తావన చేయలేదు. మనవాళ్లు నాకు బ్రీఫ్ చేశారు. వారేం చెప్పారో అది జరుగుతుంది. మనం కలిసి పని చేద్దాం అని అన్నారు. దానితోనే కోట్ల రూపాయల వోటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారంటూ అప్పట్లో తెరాస సర్కార్ హడావుడి చేసింది.
ఇప్పుడు
కేటీఆర్ ఒక బీజేపీ నాయకుడిని టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఫోన్ లో మాట్లాడుతున్న ఆడియో లీక్ అయ్యింది. మనుగోడు ఉప ఎన్నిక తో తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడేదీత లేదు.. టీఆర్ఎస్ సర్కార్ కూలిపోయేదీ లేదు. అందుకే మీరు మా పార్టీలోకి రండి మీ ఆశీర్వాదం కావాలి అంటే పార్టీలో చేరాల్సింగా ఒత్తిడి చేశారు.
అయితే ఈ విషయంలో కేసీఆర్ ఔను అవును నేనే మాట్లాడాను. తప్పా. ఆయనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అదేమన్నా తప్పా.. పని చేశాం అని చెప్పాం. పార్టీలోకి రమ్మని అడిగాం తప్పేముంది అన్నారు. ఈ రెండు ఆడియోలూ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి. నాడు చంద్రబాబు విషయంలో ఒకలా.. నేడు కేటీఆర్ విషయంలో ఒకలా టీఆర్ఎస్ స్పందన ఉండటం గమనార్హం అంటూ పరిశీలకులు అంటున్నారు.