అధ్యక్ష ఎన్నికల తర్వాత రాహుల్ రోల్ ఏమిటి?
posted on Sep 22, 2022 @ 10:41AM
ఎంత మంది ఎన్ని విధాలా విజ్ఞప్తులు చేసినా, పీసీసీతీర్మానాలు చేసి రిక్వెస్టులు పంపినా రాహుల్ గాంధీ మారలేదు. మనసు మార్చుకోలేదు. 2019లో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వస్రమైన అర్హతలన్నీ, మీకే, మీఒక్కరికే ఉన్నాయి, కాదనకండి, కరునించండి, అని దేశం వ్యాప్తంగా ఉన్న లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు సంతకాలు చేసి విజ్ఞాపనలు పంపినా, రాహుల్ గాంధీ మాత్రం మాట మీదనే నిలబడ్డారు. దటీజ్ హిజ్ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్.
రాహుల్ నో అన్నారు కాబట్టే, ఇప్పడు, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేసు మొదలైంది. ముందు ఇద్దరే అన్నారు. ఇప్పడు ముగ్గురయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, కేరళ ఎంపీ శశి థరూర్’ తోపాటుగా తాజాగా, దిగ్విజయ సింగ్’ కూడా బరిలో దిగేందుకు రెడీ అంటున్నారు. ఈ నెంబర్ ఇంకా పెరిగిన పెరగవచ్చును. నిజానికి, ఇంకా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈరోజే ( సెప్టెంబర్ 22) ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 25 వ తేదీ నుంచి నామినేషన్ల ఘట్టం మొదలవుతుంది. 28 వరకు కొనసాగుతుంది. సో అంతవరకు ఎవరు ఏమి చెప్పినా అవ్వన్నీ ఊహాగానాల, వ్యూహాగానాలో కావచ్చును. అసలు కథ ఏమిటన్నది, నామినేషన్లు, స్క్రూటినీ, ఉప సంహరణలు పూర్తయితేనే కానీ తేలదు. అంత వరకు రేసులో ఎవరున్నారు, ఎవరు లేరు అన్న విషయం చెప్పలేము. అందులోనూ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. సో .. మన రేవంత్ రెడ్డో, మన జగ్గా రెడ్డో ఇంకొక రెడ్డో కూడా బరిలో దిగినా దిగవచ్చును.
అయితే ఇప్పడు, ఎవరు బరిలో దిగుతారు,ఎవరు పార్టీ సారధ్య బాధ్యతలు చేపడతారు, అనేది ప్రశ్న కానే కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, నూతన అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాహుల్ గాంధీ, ఏమి చేస్తారు? ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కీలక ప్రశ్న. నిజానికి, రాహుల్ గాంధీ మూడేళ్ళ క్రితం పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కానీ, అధ్యక్షుడిగానే వ్యవహరిస్తున్నారనే విమర్శ వినవస్తూనే వుంది.
ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, గులాం నబీ ఆజాద్’ కూడా అదే విమర్శ చేశారు. సోనియా గాంధీ పేరుకు మాత్రమే పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని, కీలక నిర్ణయాలన్నీ ఆయన చుట్టూ చేరిన కొద్ది మంది, అనుభవం, అవగాహనా లేని నాయకులూ తీసుకుంటున్నారని ఆరోపించారు. అంతే కాదు, రాహుల్ గాంధీ కోటరీని ఉదీసించి ఆజాద్, తీవ్ర వ్యాఖ్యలే చేశారు. కీలక నిర్ణయాలన్నింటినీ రాహుల్ సెక్యూరిటీ గార్డులు, పీఏలు తీసుకుంటోన్నట్లు కనిపిస్తోందని అన్నారు.
నిజానికి, ఆజాద్ చేసిన ఆరోపణలు నిజం లేక పోలేదని, గత మూడు సంవత్సరాలుగా జరుగుతన్న పరిణామాలను గమనిస్తున్న సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు. పంజాబ్’ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుల మార్పు వంటి కీలక నిర్ణయాలు కూడా, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా తీసుకున్నారని, ఫలితం ఏమిటో ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉందని అంటున్నారు. అలాగే, తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకం విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి.
నిజానికి, రాహుల్ గాంధీ డిఫాక్టో అధ్యక్షుడిగా వ్యవహరించడం మాత్రమే కాదు, పార్టీలో కొద్ది మంది సీనియర్ నాయకులు మినహా మిగిలిన చిన్నాపెద్ద నాయక్లులు ,పార్టీ శ్రేణులు రాహుల గాంధీనే, నాయకుడిగా గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. పార్టీ అధినాయకునిగా ఆరాధిస్తున్నారు.అందుకే రాహుల్ గాంధీ బాధ్యతలకు దూరంగా ఉన్నా అధికారాలు మాత్రం ఆయన చేతుల్లోనే ఉన్నాయి. సరే, ఇంతవరకు, సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు
కాబట్టి, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా కన్న బిడ్డలుగా ఆమె బాధ్యతలను కొంత పంచుకున్నారు, అనుకోవచ్చును. కానీ, రేపు సోనియా గాంధీ పకక్కు తప్పుకున్న తర్వాత కూడా రాహుల్ గాంధీ ఇదే విధంగా, డిఫ్యాక్టో అధ్యక్షుడిగా, బాధ్యతలు లేని అధికారాలను చెలాయిస్తారా,?ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.