ఒక్క నిర్ణయం రెండు పరాభవాలు!
posted on Sep 22, 2022 @ 10:58AM
అదేదో సినిమాలో హీరో అంటాడు.. వన్ షాట్ టూ బర్డ్స్ అని. ఓ సినిమాలో కమెడియన్ హీరోయిన్ నుంచి పువ్వు అందుకుంటాడు, వెనక్కి తిరగ్గానే హీరో అతగాడి చెంప ఛెళ్లుమనిపిస్తాడు! రెండూ ఊహించనివే! కొండకచో ఏపీ ముఖ్యమంత్రికి ఇలాంటి అనుభూతే కలిగి ఉంటుంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చి దేశంలోని ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఇంకా తిట్లు తింటూనే ఉన్నారు. తెల్లార గానే ఎలక్షన్ కమిషన్ జగన్‌కు పార్టీ శాశ్వత అధ్యక్షపదవి ఉండకూడదని షాక్ ఇచ్చింది.
ఇది ఊహించని చర్య, ప్రతిచర్య అన్నారు చాలామంది. ఎవ్వరికీ నచ్చని పనిచేస్తే దాని ప్రభావం వెం టనే కాకున్నా తర్వాతయినా అనుభవించాల్సి వస్తుందని సామాజిక శాస్త్రవేత్తల మాట. అది రాజకీయా లకీ వర్తిస్తుంది. నాయకులు ఆచీ తూచీ వ్యవహరించాలి. అధికారంలో ఉన్న ధీమాను, మొండితనాన్ని ప్రదర్శిస్తే పార్టీ ఫాలోయర్లు కూడా దూరమవుతారు. అందుకు తాజా సాక్ష్యం వైపీసీ అధినేత, ఏపీ ముఖ్య మంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం. ఒక్క నిర్ణయం రెండు పరాభవాలనిచ్చింది. ఇది ఎవరికీ జరిగి ఉండ కాపోవచ్చు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ బుధవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా ఓ సెటైరికల్ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకట నను విడుదల చేసింది.
వరుసగా జరిగిన ఈ రెండు కీలక పరిణామాలను ప్రస్తావిస్తూ జగన్‌పై నారా లోకేశ్ సెటైర్ సంధించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు.. తన పార్టీకి తానే అధ్యక్షుడు కాకుండా పోయాడు అంటూ లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రెండూ ఒకే రోజు జరిగాయని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని, జగన్ భవిష్యత్తు ఏమిటోనని కూడా లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. తన ట్వీట్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకి రాసిన లేఖ ప్రతిని కూడా ఆయన జత చేశారు.