బండి పాదయాత్రను ఆపేసి టీఆర్ఎస్ సాధించేదేమిటి?
posted on Aug 24, 2022 @ 10:46AM
గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తీసుకువచ్చారన్నది సామెత. టీఆర్ఎస్ బండి సంజయ్ పాదయాత్ర విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ సామెతనే గుర్తు చేస్తున్నది. బండి ప్రజా సంగ్రామ యాత్ర.. ఆ యాత్ర ఎప్పుడు ఎక్కడ జరుగుతోందో కూడా రాష్ట్రంలో జనం పట్టించుకోవడం లేదు. విడతల వారీగా బండి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ నడుస్తున్నారు. ముగింపు సభ పేర పార్టీ అగ్రనాయకులను తీసుకువచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యాత్రలో ఆయన చేస్తున్న విమర్శలు, ప్రసంగాలూ అన్నీ ఆవు కథనే చెబుతున్నాయి. కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ అవినీతి అన్న విమర్శలు తప్ప కొత్తదనం ఏమీ లేదు. రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు వినా మరెవరూ ఈ యాత్రను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బండి పాదయాత్ర వల్ల ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతోందంటూ యాత్రకు బ్రేక్ వేయడం ఎందుకో? దాని వెనక ఉన్న వ్యూహమేమిటో అర్ధం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు. అవసరం లేని ఆంక్షల వల్ల బీజేపీ గ్రాఫ్ పెరగడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. పైగా బండి సంగ్రామ యాత్ర దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. మరో మూడు రోజులలో అంటే ఈ నెల 24న ముగుస్తున్నది. అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు యాత్రను నిలువరించి టీఆర్ఎస్ ఏం సాధిద్దామునుకుంటోందన్నది ఆ పార్టీ వ్యూహకర్తలే చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె తనయ పేరు ఉందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలపై నుంచి దృష్టి మరల్చడానికే బండి సంజయ్ యాత్రను నిలువరిస్తున్నారని భావించడానికి లేదు. ఎందుకంటే.. ఇప్పుడు సంజయ్ యాత్రను నిలువరించడానికి ఆ అంశంపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానికేనని బీజేపీ ఆరోపణాస్త్రాలు సంధిస్తుంది.
పైగా యాత్ర నిలువరించడానికి వ్యతిరేకంగా చేపట్టే ఆందోళనల్లో కూడా ప్రముఖంగా లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయాన్ని ప్రస్తావిస్తుందనడంలో సందేహం లేదు. యాత్ర సాగడం కంటే యాత్రను నిలువరించడం వల్లనే బీజేపీకి ఎక్కువ మైలేజ్ వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానికి ఉదాహరణగా పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన తరువాత ఇంత కాలంగా బండి ప్రజాసంగ్రామ యాత్రకు రాని కవరేజి మీడియాలో వచ్చింది.
ఇప్పటి దాకా పెద్దగా యాత్రను పట్టించుకోని జనం కూడా యాత్ర ఎందుకు నిలిపేస్తున్నారన్న విషయంపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అన్నిటికీ మించి బండి పాదయాత్రకు అవరోధాలు కలిగించడంపై బీజేపీ అగ్రనేతలు సైతం స్పందించి ప్రకటనలు, ఖండనలు గుప్పిస్తున్నారు. దీంతో విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
అన్నిటికీ మించి లిక్కర్ స్కాం లో కేసీఆర్ తనయ కవిత పేరు బయటకు రావడం వల్లనే బీజేపీపై టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పట్టించుకోకుండా వదిలేస్తే ఏ ప్రచారం లేకుండా ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు ముగిసిందో తెలియకుండా పూర్తి కావలసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పుడు ఆంక్షల వల్ల అందరికీ తెలిసింది. చర్చకు కేంద్రంగా మారింది. దీనివల్ల బీజేపీకి మైలేజి పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.