Read more!

జీవితంలో అవకాశాల పాత్ర ఏమిటి?

జీవితంలో మనిషిని మరొక స్థాయికి తీసుకెళ్ళేవి అవకాశాలు. ఒక అవకాశం మనిషి ఆర్థిక, సామాజిక స్థితిగతులనే మార్చేస్తుంది. కానీ కొందరు అవకాశాల్లేవని సాకులు చెపుతూ ఉంటారు.  కష్టపడటాన్ని ఇష్టపడకపోవడమే వాళ్ళు అలా చెప్పడానికి కారణం. కష్టం ఉంటేనే మనిషికి జీవితం విలువ, జీవితంలో అవకాశాలు, ఎదుగుదల మొదలైన వాటి విలువ అర్థమవుతుంది. 

"అవకాశాలకు అనుగుణంగా జీవిస్తూ వనరులను పెంచుకోవటమే మానవుని అద్భుత విజయం" అంటారు   -వాలేనార్గ్స్. 

ప్రపంచంలో చాలామంది వ్యక్తులు వున్న అవకాశంతోనే సంతృప్తిపడి, నూతన అవకాశాల కోసం ఎదురుచూడరు. కొంతమంది విజేతలు నిరంతరం అవకాశాలకేసి చూస్తుంటారు. చాలామంది ఉద్యోగులు అన్ని అర్హతలు ఉండికూడా వారు చేస్తున్న వృత్తిలో సుఖాన్ని, క్షేమాన్ని పొందుతూ నూతన ప్రయత్నాలు చేయరు. వారికి ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోగలిగితే జీవితంలో గొప్ప వ్యక్తులుగా మార్పు చెందవచ్చు. అవకాశం అనేది మనల్ని అదృష్టవంతుల్ని చేస్తుంది. అవకాశాలు అనేవి అందరికీరావు, అవి కొంతమందికే వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని సద్వినియోగ పరచుకోవాలి.

అవకాశాలు మీ ఇంటి తలుపు తట్టినపుడు మీరు లేకుంటే మరోసారి ఆ అవకాశాలు ఇంక మీ ఇంటికి రావు అని ఎవరైనా అంటే వారు తప్పు చెప్పినట్లే ! ఎందుకంటే అవకాశాలు ప్రతిరోజూ మీ ఇంటి బయట నిలబడి నిద్రలేపి, పోరాడి విజయలక్ష్మిని చేపట్టమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటాయన్న విషయం మరచిపోవద్దు !

ఒక్కొక్కసారి అవకాశాలు మనకి కష్టమైనవిగా, సాధించలేనివిగా, చేయలేనివిగా అనిపిస్తాయి. పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని, పట్టుదలతో ప్రయత్నిస్తే, విజయాలు సాధించవచ్చు. మనం వదిలేసిన అవకాశాలను సమర్థులు ఎగరేసుకు పోతారు. అవకాశాలు అనేవి అదృష్టాలు కావు, వారసత్వాలు అంతకంటే కావు, వాటిని పట్టుదల తో సాధించుకోవాలి. చెట్టుపైనుండి ఆపిల్ క్రిందపడటాన్ని చూసిన న్యూటన్ కి అది కొత్త సిద్ధాంతానికి ప్రేరణగా, అవకాశంగా అనిపించింది. అంతకుముందు ఆపిల్ క్రిందపడటాన్ని చూసిన కొన్ని లక్షలమంది దాన్ని కొత్త ఆవిష్కరణకు అవకాశం అనుకోలేదు. తినడానికి దొరికిన పండుగా అనుకున్నారు. న్యూటన్ దాని కొత్త ఆవిష్కరణకి అవకాశం అనుకుని, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. చరిత్రలో నిలిచాడు. ఆ విధంగా మనంకూడా అవకాశాలను సృష్టించుకోవాలి. 

అవకాశాల కోసం కాచుకుని ఉండటం బలహీనుల లక్షణం, అవకాశాలను సృష్టించుకోవడం బలవంతుల లక్షణం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడడం కన్నా మనమే అవకాశాలకోసం వెతుక్కుంటూ వెళ్లాలి. అవకాశాలు వాటంతట అవిరావు. వాటిని మనమే సృష్టించుకోవాలి. అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూడకూడదు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓ కొమ్మమీదో, ఓ గూటిలోనో ఎక్కువసేపు ఉండని పక్షి లాంటిదే అవకాశం. ఒక అవకాశాన్ని మనం జారవిడుచుకున్నప్పుడు విచారించకూడదు. మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్తపడాలి. అవకాశాలను అందుకోవడమే కాదు. దొరికిన అవకాశాన్ని జారవిడుచుకోకపోవడం కూడా ముఖ్యమే ! అవకాశాలు అందిపుచ్చుకోవడం అంటే ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. అవకాశాల ద్వారా డబ్బులు, పేరు ప్రతిష్ఠలు, కీర్తి, అధికారాల్ని మంచి జీవితాన్ని సంపాదించు కోవచ్చు.

అందుకే మనిషి తన జీవితంలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా తనచుట్టూ ఉన్న అవకాశాలను కనుగొని వాటి సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే తనున్న పరిస్థితులకు అనుగుణంగా అవకాశాలను సృష్టించుకోవాలి.

                                     ◆నిశ్శబ్ద.