పవన్ కు జగన్ భయపడుతున్నారా?.. తెలుగుదేశంతో జనసేన పొత్తు సంకేతాలతో గాభరా పడుతున్నారా?
posted on Oct 21, 2022 @ 1:55PM
జగన్ లో పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధమౌతున్నారన్న భయంతో ఏపీ సీఎం జగన్ వణికి పోతున్నారా?.. అందుకే ఎంత పెద్ద సమస్య ప్రభుత్వాన్ని కుదిపేసేంతగా ప్రకంపనలు సృష్టించినా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్.. పన్నెత్తి సమస్యల గురించి ప్రస్తావని సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో పార్టీ క్యాడర్ సమావేశంలో చేసిన ప్రసంగంపై స్పందించారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి పార్టీ పరువును, ప్రభుత్వ పరువునూ కూడా మూసీ నదిలో కలిపేసిన సందర్భంలో కూడా పన్నెత్తి మాట్లాడని జగన్ పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించి.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించడంపై స్పందించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అయినా తెలుగుదేశం, జనసేనల మధ్య అవగాహన కుదిరితే.. వచ్చే ఎన్నికలలో వైసీపీ కథ ముగిసిపోతుందని బయపడుతుండటం వల్లనే జగన్ పవన్ వ్యాఖ్యలపై ఎదురుదాడికి తానే స్వయంగా పూనుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ మంగళగిరి సమావేశంలో ప్రదర్శించిన ఆవేశం, వైసీపీ నేతలపై చేసిన విమర్శల వర్షం వైసీపీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని జగన్ భావిస్తున్నారనీ, అందుకే వాటిని తిప్పికొట్టడానికి తానే స్వయంగా రంగంలోకి దిగారని అంటున్నారు.
పార్టీ కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన వీరావేశం రాష్ట్ర రాజ కీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. ఇంత కాలం వైసీపీ నేతల నోటి దురుసుకు భయపడో.. వారంత అసహ్యంగా మాట్లాడటం మర్యాద కాదనో ఇతర పార్టీలన్నీ ఒకింత మౌనంగానే ఉన్నాయి. ఎప్పుడైతే పవన్ వైసీపీవి ప్రేలాపనలంటూ.. ఇష్టారీతిగా నోరు పారేసుకుంటే తాను అదే స్థాయిలో విరుచుకుపడతానని హెచ్చరించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక వైసీపీ వారి దుర్బాషలను మౌనంగా సహించే పరిస్థితి ఉండదని అన్ని పార్టీల వారూ ప్రతి విమర్శలకు పదును పెడతారని జగన్ కు అర్ధమైపోయింది.
అందుకే పవన్ పై తన మంత్రుల చేత ఎదురు దాడి చేయించి ఊరుకుంటే సరిపోదని భావించి సీఎం జగనే తన నోటికి పని చెబుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైకాపా నేతల భాషతో పోలిస్తే పవన్ మాటల్లో అభ్యంతర పెట్టవలసినంత బూతు లేదు. కానీ ఎందువల్లనో ఆ మాటలు జగన్ మనసుకు అవి ములు కులుగా గుచ్చుకొన్నాయి. పవన్ చెప్పు చూపింది తనకే అన్నంత ఆగ్రహం రగిలింది ఆయనలో. దానితో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలతో పని లేదు, నేరుగా తానే రంగంలోకి దిగి, లెక్క తేల్చేస్తానని శపథం పట్టాడు. సాధారణంగా ఎంత పెద్ద రాజకీయ రగడ జరిగినా ఇల్లు వదలి బయటకు రావడం, విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం జగన్ నైజం కాదు. అనుచరులు చెలరేగిపోతుంటే తాను చిద్విలాసంగా నవ్వులు చిందించడం ఆయన తీరు. అసెంబ్లీలో వైసీపీ నేతల దుర్భాషలు చేసిన సందర్భంగానూ, పలు సందర్భాలలో కొడాని నాని, అనీల్ కుమార్ యాదవ్ వంటి వారు నోరేసుకుని విపక్ష నేతపై ఇష్టాను సారంగా చెలరేగిన సందర్భంలోనూ, అలాగే హస్తిన మద్యం కుంభకోణంలో తన సతీమణిపై ఆరోపణలు వచ్చిన సందర్బంలో కూడా జగన్ పన్నెత్తి మాట్లాడలేదు. నోరెత్తి స్పందించలేదు.
ఏదైనా అనుచరగణమే చూసుకోవాలన్న విధానాన్ని ఇంత కాలం అనుసరిస్తూ వచ్చారు. కానీ పవన్ విషయంలో మాత్రం ఆయనలో ఆ నిగ్రహం మటుమాయమైపోయింది. రాబోయే ఎన్నికలకు సన్నాహాలు చేసుకొంటున్న తనకు పవన్ కంట్లో నలుసు వలె మారారని ఆయన భావిస్తున్నారు. అన్నిటికీ మించి పవన్ వెనుక, ఆయన సమాజీక వర్గం సమీకరణ జరిగితే ఇక రాజకీయంగా వైసీపీకి నూకలు చెల్లినట్లే అవుతుందని జగన్ భావిస్తున్నారనీ, అందుకే ఆయనలో ఈ ఆగ్రహం, ఆవేశం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన, బీజేపీ కలిసి సాగితే జగన్ కు ఏం నష్టం ఉండదు. ఎటూ బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఉంది కనుక జనసేన, బీజేపీల మైత్రి వల్ల అంతిమంగా తనకే లబ్ధి చేకూరుతుందన్నది జగన్ భావన.
అయితే ఎప్పుడైతే జనసేన, తెలుగుదేశం దగ్గర అవుతున్నాయన్న సంకేతాలు కనిపించాయో జగన్ లో గాభరా మొదలైందనీ, ఓటమి భయం పట్టుకుందనీ విశ్లేషకులు అంటున్నారు. అందుకే జగన్ స్వయంగా నోరు చేసుకుని జనసేన అధినేత పైనా, ఆ పార్టీ తెలుగుదేశంతో జట్టు కట్టడంపైనా విమర్శల బాణాలు సంధించారంటున్నారు. ఆ రెండు పార్టీల కలయికను అడ్డుకోవడమే ఏకైక అజెండాగా ఇక జగన్ కార్యాచరణ ఉంటుందని విశ్లేషిస్తున్నారు.