విశాఖ రామానాయుడు స్టూడియోను బెదరించి రాయించేసుకున్నారా?
posted on Oct 21, 2022 @ 2:13PM
ఆ స్టూడియో ఇప్పుడు రామానాయుడు కుమారుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అధీనంలో లేదా? అంటే తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఔననే అంటున్నారు. ఆ స్టూడియోపై సీఎం జగన్ సతీమణి భారతి కన్నుపడిందనీ, వెంటనే దానిని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైందనీ అన్నారు.
గతంలో కూడా విశాఖలోని రామానాయుడు స్టూడియో ను స్వాధీనం చేసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రక్రియ ఏమయిందో కూడా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు చేతులు మారిపోయిందని అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు. దగ్గుబాటి సురేష్ బాబును పిలిపించుకుని మరీ బెదరించి కాగితాలపై సంతకాలకు చేయించుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తాను ఈ విషయంలో దగ్బుబాటి సురేష్ బాబుతో మాట్లాడాననీ, బెదిరిస్తున్నారు. ఏం చేయమంటారు అందుకే సంతకాలు పెట్టేశానని ఆయన తనకు చెప్పారని అయ్యన్నపాత్రుడు అన్నారు.
ఆయన ఈ విషయాలను ఏదో ప్రైవేటు సంభాషణలో చెప్పలేదు. మీడియా ముఖంగానే చెప్పారు. విశాఖలో జనసేనాని పర్యటన సందర్భంగా జరిగిన గొడవకు సంబంధించి అరెస్టయిన జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన జైలు వద్దకు వచ్చారు.
జనసేన కార్యకర్తలను కలిసేందుకు ముందు అనుమతి ఇచ్చిన జైలు అధికారులు ఆ తరువాత అనుమతి లేదు పొమ్మన్నారనీ అయ్యన్నపాత్రుడు చెప్పారు. జైలు వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన రామానాయుడు స్టూడియో కబ్జా గురించి చెప్పారు. అలాగే విశాఖలో భూ కబ్జాల గురించి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.