తిరుమలలో ఏం జరుగుతోంది? భద్రత కరవు, పవిత్రతకు పంగనామాలు!
posted on Jul 4, 2023 @ 11:29AM
జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయో, చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో, అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. వింటూనే ఉన్నాం. వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.
ఏడుకొందలపై ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం మొదలు, ఇటీవల టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకుంటున్నతప్పుడు నిర్ణయాల వరకు అపచారాలకు లెక్కేలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందని, భక్తులు హిందూ ధర్మ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఆగ్రహిస్తున్నాయి.
అంతేకాదు, తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులు వ్యక్తపరుస్తున్నారు. ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకు, ‘దొరికినంత దోచుకో’, పద్దతిలో టీటీడీ దోపిడీకి పాల్పడుతోందని, భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు.అదే సమయంలో భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు, నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి, దప్పికలు తీర్చేందుకు, గతంలో సమయానుకూలంగా ప్రసాద వితరణ జరిగేది .. ఇప్పడు అది లేదు. కనీసం జల ప్రసాదం కూడా అందుబాటులో ఉండడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే, క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం లేకుండా పోయింది, దుర్వాసనలు భరిస్తూ స్వామి స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వస్తోందని భక్తులు అంటున్నారు.
సరే తిరుమల భద్రత, హిందూ ధార్మికతకు టీటీడీ తిలోదకాలిచ్చేసింది. ఇప్పుడు పవిత్రతకు కూడా పంగనామాలు పెట్టేస్తున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం.. స్వామి వారి దర్శనం కోసం కర్నాటక నుంచి వచ్చిన భక్తులు కూడా పెంపుడు కుక్కను కూడా తీసుకువస్తే అలిపిరి చెక్ పాయింట్ వద్ద విజిలెన్స్ పట్టించుకోకుండా వదిలేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కర్నాటక నుంచి సొంత వాహనంలో అలిపిరి చెక్ పోస్టు మీదుగా తిరుమల చేరుకున్నారు. చెక్ పాయింట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వారి వాహనంలో ఉన్న పెంపుడు కుక్కను పట్టించుకోకుండా తిరుమలపైకి అనుమతించేశారు. దీంతో వారు తమ పెంపుడు కుక్కతో తిరుమలకు వచ్చేశారు.
తిరుమలపైకి పెంపుడు జంతువులకు అనుమతి లేకపోయినా విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తిరుమలపై పెంపుడు కుక్కతో తిరుగుతున్న భక్తుల బృందాన్ని గమనించిన మీడియా ఫొటోలు తీసి అధికారులకు సమాచారం అందజేయడంతో వారు హడావుడిగా రంగ ప్రవేశం చేసి పెంపుడు కుక్కతో తిరుమల చేరుకున్న భక్త బృందాన్ని వారి వాహనం, శునకంతో సహా కొండ కిందకు పంపేశారు.