జగన్ పాలనపై జనసేన గరంగరం
posted on Jul 4, 2023 @ 11:48AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనపై జనసేన పార్టీ మరోసారి నిప్పులు చెరిగింది. ఈ జగన్ పాలనలో ఏ వర్గం సురక్షితంగా ఉందో చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. సోమవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న.. స్పందన కార్యక్రమానికి స్పందనే లేదని వ్యంగ్యంగా అన్నారు. అలాగే జగనన్నకు చెబుదామనే కార్యక్రమాన్ని చేపట్టారని.. చెబితే వినేవారు లేరని.. ఇప్పుడు తాజాగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని.. పాలకుల్లో స్పందించే గుణం లేనప్పుడు ఏ కార్యక్రమం అయితే ఏముందని ఆయన జగన్ అండ్ కోని సూటిగా ప్రశ్నించారు. అలాగే అర్హత ఉన్న లబ్దిదారులకు సైతం పథకాలు అందడం లేదని ఈ జగన్ ప్రభుత్వమే స్పష్టం చేస్తుందని.. ఇది దేనికి సంకేతమని ఆయన ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. వైయస్ జగన్ ఈ నాలుగేళ్ల పాలన అద్బుతమని అంటారని.. అలాంటప్పుడు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఎందుకు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జగనన్న సురక్ష కార్యక్రమంలో చోటు చేసుకొంటున్న వ్యవహారాలపై ఈ సందర్భంగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏం చేస్తుందంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెప్పుకొంటున్నట్లు.. మీ పాలన అద్బుతంగా ఉంటే.. వారాహి యాత్ర చేపట్టిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమస్యలు చెప్పుకొనేందుకు అంత మంది ఎందుకు వచ్చారని నిలదీశారు. అమ్మఓడి బటన్ నొక్కినా.. నేటికి కొంత మంది ఖాతాల్లో ఆ పథకం తాలుకు నగదు జమ కాలేదని.. దీనికి సమాధానం ఏం చెబుతారంటూ.. జగన్ పార్టీ నేతలను ఆయన నిలదీశారు. అలాగే మీరు హాజరయ్యే సభలకు కోట్లాది రూపాయిల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారని.. హెలికాప్టర్లు వినియోగిస్తారని.. అంతేకానీ... క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేశారంటూ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో రహదారుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ క్రమంలో మలికిపురంలో పవన్ కల్యాణ్ హెచ్చరికతోనే రాజోలులోని రహదారి పనులు ప్రాంభించారని ఆయన వివరించారు. 151 మంది ఎమ్మెల్యేలు, ఇంత మంది యంత్రాగాన్ని పెట్టుకొని.. ఎందుకు సరైన పాలన అందించ లేకపోతున్నారని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని సూటిగా ప్రశ్నించారు.
జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమంలో ఫించన్లు, రహదారుల సమస్యలపైన ఫిర్యాదులు అధికంగా వచ్చాయని చెప్పారు. అలాగే మీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దివ్యాంగుడికి 75 రూపాయిల ఫెన్షన్ వచ్చేదని.. ప్రస్తుతం అతడు విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటాయని పెన్షన్ నిలుపు చేశారని పేర్కొన్నారు. ఇలా పదుల సంఖ్యలో దివ్యాంగులు పవన్ వద్ద తమ సమస్యలు చెప్పుకొన్నారన్నారు.. తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాల వరకు స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారని.. మరి స్పందించే గుణం లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకు అని ప్రశ్నించారు. అయినా ఇప్పటి వరకు ఎన్ని సమస్యలపై స్పందించారంటూ జగన్ ప్రభుత్వానికి నాదేండ్ల మనోహర్ సూటిగా ప్రశ్నించారు.
వైసీపీ మ్యానిపెస్టోలో 99 శాతం పూర్తి చేశామని చెబుతున్నారని.. మరి స్పందన సరిపోదని జగనన్నకు చెబుదామని వ్యంగ్యంగా అన్నారు. ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని.. జగనన్న వినడు, ఎమ్మెల్యేలు వినరు... అధికారులు అంతకంటే వినరన్నారు. మరి ప్రజలు.. తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలంటూ సందేహం వ్యక్తం చేశారు. గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పించన్ల ఇచ్చే క్రమంలోనే కాదు.. రైతుల వద్ద సైతం లంచాలు తీసుకొంటున్నారని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి పాలనలో ఎవరూ సురక్షితంగా లేరని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్.. ఇటీవల చేపట్టిన వారాహీ యాత్ర అద్భుతంగా సాగిందన్నారు. 10 కిలోమీటర్ల మేర.. ఇంత పెద్ద బహిరంగ సభలు ఇంత వరకు ఎవరు పెట్టలేదన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆశీర్వదిస్తుంటే.. తట్టుకోలేక ఆయనపై విమర్శలకు దిగుతున్నారని.. వ్యవస్థలోని లోపాలపై పవన్ కల్యణ్ విమర్శలు చేస్తే.. ఆయనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ విమర్శించే అంశాలపై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇవ్వరని.. ముగ్గురు, నలుగురు మంత్రుల చేత పవన్‌ని తిట్టిస్తారని ఆయన చెప్పారు.
రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్... అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి... ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తారని స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ బాధ్యతను ఆయన ప్రజలకు గుర్తు చేస్తారన్నారు. ఈ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందని.. జనసేన తిరిగి వెలుగులు నింపుతోందన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం .. అందరూ కలిసి కట్టుగా ముందుకు వచ్చి నిలబడాలని ప్రజలకు నాదెండ్ల మనోహర్ పిలుపు నిచ్చారు.