వీటి గతి ఇంతేనా..!
posted on Oct 26, 2022 @ 10:00AM
అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వాలే ప్రజలు కోరుకుంటాయి. పేదలను ఆదుకునే నాయకుడినే ప్రజలు కోరుకుంటారు. ప్రజోపయోగ పనులు చేస్తుంటేనే ప్రజలు నాయకుడిని, ముఖ్యమంత్రినీ, పార్టీనీ అభిమానిస్తారు. అలాగాకుండా కేవలం తమ స్వార్ధం కోసం కేవలం ప్రకటనలు, ప్రమాణాలకు పరిమిత మయితే ప్రజలు ఏమాత్రం సహించరు. పేదలకు కూడా నివాసం ఉండాలని, వారిని ఆదుకోవాలన్న ఆలోచన మంచిదే . వారికీ ఇళ్లు కట్టించే ప్రయత్నాలూ హర్షణీయమే. డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేస్తా మని హామీలిచ్చి ఆశలు కల్పించారు. కానీ వాటిని అనుకున్న సమయంలో పూర్తిచేసి వారికి అంద జేయడం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాటిలో సామాన్యు దొంగలపరం అవుతున్నాయి. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది ఎంతో నిజం.
తెలంగాణా ప్రభుత్వం ఇందుకు మినహాయింపు కాదు. ఘట్ కేసర్సమీపంలోని రాంపల్లి, జవహర్నగర్ సమీపంలోని అహ్మద్గూడ, నల్లగండ్ల పోచంపల్లి, కుంట్లూరు, హయత్ నగర్ ప్రాంతాల్లోకి వెళితే అంతా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కనపడతాయి. కానీ వాటిలో నివాసయోగ పనులు యింకా పూర్తి కాలేదు. యింకా కరెంటు, వాటర్ కనెక్షన్ పనులు చాలా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కట్టినంతమేరకు వదిలేశారు. తమ పని అయిపోయిందను కుంటున్నారేమో మరి. చాలారోజులుగా అలా ఉండిపోవడంతో కొన్ని వస్తువులు తుప్పుపట్టి పాడయిపోతున్నాయి, చాలా వస్తువులు దొంగలపరం అవుతున్నాయి. ముందు అక్కడ సిద్ధపరచుకున్న వస్తువులేవీ అక్కడ లేవనే అనాలి. అంతా దొంగలబారిన పడిందని అక్కడివారి మాట.
ఇళ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసిన తర్వాత వెంటనే ఆ పని పూర్తిచేసిన తర్వాత వాటిని అర్హులకు అందజేయాలి. కానీ పని పూర్తిచేయక, అర్హులను అలా ఎదురుచూస్తుండమని ఇంకా ఎన్నాళ్లిలా అందకుండా చేస్తారన్నది ప్రశ్న. ఇప్పటికే నిర్మాణపనులకు కావలసిన వస్తువులు దొంగలపాలవుతోంది. దీన్ని ప్రబుత్వం అధికారులు పట్టించుకో కుంటే కొన్నాళ్లు పోతే సంబంధంలేని వ్యక్తులు కబ్జా చేసి అవన్నీ మావే అన్నా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇకనైనా వాటిని పట్టించుకుని వదిలేసిన నిర్మాణపనులు పూర్తిచేసి అర్హులకు వాటిని అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అక్కడివారు కోరుతున్నారు. మరి ప్రభుత్వానికి ఈ ఓటర్లు లెక్కలోకి వస్తారా?
...