డాన్స్ పాల్ డాన్స్
posted on Oct 26, 2022 @ 10:17AM
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తార స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు చతురంగ బలాలను రంగంలోకి దింపి ప్రచారాన్ని ఉధృతం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణల పర్వం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇతా మునుగోడులో వాతావరణం హీటెక్కింది.
ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై దాడి యత్నం జరిగింది. కాంగ్రెస్ ప్రచార సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇలా ఒకటేమిటి ప్రతి రోజూ నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ప్రతి రోజూ నియోజకవర్గానికి తరలుతున్న సోమ్ము కోట్లలో పట్టుబడుతోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాహనాన్ని 24 గంటల వ్యవధిలో మూడు సార్లు తనిఖీ చేశారు.
అయితే ఇంతటి ఉద్రిక్తతల్లోనూ, ఇంతటి సీరియస్ వాతావరణంలోనూ ఓ వ్యక్తి ప్రచారం మాత్రం నియోజకవర్గ ప్రజలకు కామెడీ పంచుతోంది. వారిని కడుపుబ్బా నవ్విస్తోంది. వినోదాన్ని అందిస్తోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నిక రంగంలోకి దిగారు. అసలు ఆ పార్టీ అభ్యర్థిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ పోటీ చేయాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో గద్దర్ పోటీకి సుముఖత చూపకపోవడంతో పాల్ స్వయంగా తానే బరిలోకి దిగారు. అయితే ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేని కారణంగా పాల్ మునుగోడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
తనకు ఓటేసి గెలిపించాలంటూ కేఏ పాల్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను కలుస్తున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. చివరాఖరికి బీజేపీ అభ్యర్థ కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డిని కూడా కలిసి తనకే ఓటేయాల్సిందిగా అభ్యర్థించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక తన ప్రాచారంలో తీన్ మార్ డ్యాన్సులతో ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు.
ఓ జానపద పాటకు పాల్ డాన్సు చేస్తున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమంలో తెర వైరల్ అవుతోంది. తన డాన్స్ తో, హావభావాలతో పాల్ మునుగోడు ప్రజలకు వినోదం పంచారు. అంతేనా ప్రచారంలో భాగంగా ఒక సెలూన్ లోకి వెళ్లి అక్కడ హెయిర్ కటింగ్ చేయించుకున్నారు. దీపావళి సందర్బంగా పాల్ ఓటర్లకు మిఠాయిలు పంచారు. మునుగోడు ఉప ఎన్నికల బరిలో పాల్ నిలలబడకపోయి ఉంటే గొప్ప వినోదాన్ని మిస్ అయి ఉండేవాళ్లమని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ప్రధాన పార్టీల ప్రచారం కంటే పాల్ ప్రచారమే బహు పసందుగా ఉందని సెటైర్లు వేసుకుంటున్నారు.